వరంగల్ చౌరస్తా/ఖలీల్‌వాడి/మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 14: కోల్‌కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుల ను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్ట ర్లు డిమాండ్ చేశారు. వరంగల్, జనగా మ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జి ల్లాల్లో బుధవారం నిరసనలు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలోని డాక్టర్లు విధులు బహిష్కరించి దవాఖానలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. జూనియర్ డాక్టర్ల ధర్నాకు ఐఎంఏ సభ్యులు, నర్సింగ్ విద్యార్థులు మద్దతు తెలిపారు. జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిజామాబాద్‌లోని జీజీహెచ్‌లో వైద్యులు, వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు దవాఖాన ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను హతమార్చిన ఘటనను నిరసి స్తూ.. మహబూబ్‌నగర్‌లో మెడికోలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేట/నీలగిరి/ఆలేరు రూరల్, ఆగస్టు 14: ‘సర్కారు దవాఖానలకు సమస్యల సుస్తీ’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలెక్టర్లు, ఇతర అధికారులు దవాఖానల్లో తనిఖీ చేసి సమస్యలపై ఆరా తీశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లో తిరిగారు. సూపరింటెండెంట్‌ను అడిగి మందుల వివరాలను తెలుసుకున్నారు. తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. స్టోర్ రూమ్‌లను పరిశీలించి వైద్యసేవల గురిం చి రోగులను అడిగి తెలుసుకున్నారు.