(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)హైదరాబాద్, జూలై 6: మంత్రుల ఓపెన్ డిబేట్ సవాల్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయిందా? అప్పుల లెకలను బజారులో పెట్టాలనుకోవడం పొలిటికల్‌గా మిస్‌ఫైర్ అని తలంటిందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్యాబినెట్ మీద నియంత్రణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసిందా? ‘ఓపెన్ డిబేట్ సవాల్’ హైడ్రామాలో మంత్రుల తీరు పార్టీ కార్యకర్తల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తంచేసిందా? వెనుకా ముందు ఆలోచన లేకుండా చేసిన సవాల్ బెడిసిగొట్టి పొలికటికల్ సెల్ఫ్‌గోల్ అయిందని తేల్చి చెప్పిందా? రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అంటూ నిలదీసిందా? అంటే గత రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే చెప్తున్నాయి. మంత్రులు ముందూవెనుక ఆలోచన లేకుండా విసిరిస ‘ఓపెన్ డిబేట్ సవాల్’ అధికార పార్టీ మెడకే చుట్టుకున్నదని ఢిల్లీ కాంగ్రెస్ అభిప్రాయపడ్డట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో క్యాబినెట్‌ను నడిపించే లీడర్షిప్ ఫెయిల్యూర్‌ను ప్రతిపక్ష బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకున్నదని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జూలై మాసం మొదటి వారంలో బీఆర్ఎస్ సవాల్, కాంగ్రెస్ మంత్రుల ప్రతిసవాల్, అనంతరం జరిగిన రాజకీయ అలజడి వ్యవహారాన్ని ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ వేర్వేరుగా ఢిల్లీకి నివేదించినట్టు తెలిసింది. మంత్రుల అనాలోచిత వీధి సవాళ్లు, క్యాబినెట్‌కు, ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు భారీ పొలిటికల్ అడ్వాంటేజ్‌గా మారిందని నివేదించినట్టు తెలిసింది. అప్రమత్తమైన ఏఐసీసీ కేసీ వేణుగోపాల్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. వీలైనంత త్వరలో రాష్ట్రంలో పర్యటించాలని, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. పాలనాపరమైన లోపాలను సరిదిద్దాలని, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నించాలని ఆదేశించినట్టు సమాచారం.
అధిష్ఠానం ఆందోళన
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం విసిరే ప్రతి చిన్న ‘ట్రాప్’లో మంత్రులు చికుకుపోతే, అది రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఢిల్లీ పెద్దలు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ దూత మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆదివారం హాట్లైన్లో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. పరిపాలనను పకనపెట్టి కేవలం రోజువారీ వివాదాలు, ప్రతిపక్ష నేతలను తిట్టిపోసేందుకే పరిమితమైతే ప్రజలు క్షమించరని అన్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్మీట్లు, వీధి సవాళ్ల ద్వారా అప్పుల లెకలు తేలవనే కనీస సత్యాన్ని గుర్తించడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని, ఇలాంటి సంక్లిష్టమైన విషయాలను రోడ్డుపై కాకుండా, శాసనసభ వేదికగానే సమాధానాలతో ఎదురోవాలనే స్పష్టమైన కార్యాచరణను రూపొందించకపోవటం ముఖ్యమంత్రి తప్పిదమని అధిష్ఠానం తలంటినట్టు చెప్పుకొంటున్నారు.
రాష్ట్ర అప్పులపై వెల్లువెత్తిన సవాళ్లు, ప్రతి సవాళ్లు, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలాంటి మరిన్ని మైండ్‌గేమ్స్‌తో అధికార పార్టీని నిరంతరం డిఫెన్స్‌లోకి నెడుతూనే ఉంటుందని, ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీ నినాదం, విధానం ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే.. భవిష్యత్తులో వైఫల్యాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధిష్ఠానం సూచించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఆలోచించే పొలిటికల్ స్ట్రాటజీ ఒక లైన్లో ఉంటే.. క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు మరోలా ఉండటమే పొలిటికల్ మిస్‌ఫైర్‌కు కారణమని తేల్చినట్టు సమాచారం. క్యాబినెట్ మంత్రులను ఒక తాటిపైకి తెచ్చి, ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా అమలుచేయడంలో సీఎం రేవంత్ పాలనాపరమైన, వ్యూహాత్మక లోపం ఉన్నదని వారు అంచనాకు వచ్చినట్టు సమాచారం. సరైన వ్యూహం, రోడ్‌మ్యాప్ లేకపోవడం వల్లే సీనియర్ మంత్రులు సైతం దికుతోచని స్థితిలో పడ్డారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమేనని స్పష్టమవుతున్నదని తేల్చినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కేటీఆర్ ఖాళీ కుర్చీ వ్యూహం.. హరీశ్ డాటాతో కౌంటర్
తనకు సంబంధంలేని వ్యవహారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తలదూర్చటం తప్పు అని టీపీసీసీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొదట ‘నేనే తెలంగాణ భవన్‌కు వస్తా’ అని ప్రకటించడం, ఆ తర్వాత ‘గన్పార్ అమరవీరుల స్తూపానికి’ రమ్మనడం, చివరకు ‘సోమాజిగూడ ప్రెస్‌క్లబ్’కు వేదిక మార్చడం ద్వారా అధికార పార్టీలో ఉన్న అభద్రతా భావాన్ని మంత్రి స్పష్టంగా బయటపెట్టారని టీపీసీసీ అధిష్ఠానానికి నివేదించినట్టు సమాచారం. జూపల్లి సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో ఆయన కోసం ఖాళీ కుర్చీ వేసి, మీడియా ముందు కూర్చోవడం ద్వారా తాము చర్చకు సిద్ధమనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారని చెప్పినట్టు తెలిసింది. సవాల్ విసిరిన అధికార పార్టీనే చివరకు శాంతిభద్రతల పేరుతో వెనకి తగ్గి, ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయించాల్సి రావటం అవమానకరమని ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. మరోవైపు హరీశ్‌రావు ఆర్బీఐ, కాగ్ నివేదికలతోపాటు స్వయంగా రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పాత వీడియో క్లిప్పింగ్స్‌ను వాట్సాప్ ద్వారా జూపల్లికి పంపి రాజకీయంగా రచ్చ చేశారని, ‘ప్రభుత్వ డాటాలోనే స్పష్టత లేదు, మంత్రుల వద్ద సరైన లెకలు లేవు’ అని నిరూపించే ప్రయత్నంతో ప్రతిపక్షం పైచేయి సాధించిందన్న చర్చ సర్వత్రా నడుస్తున్నదని టీపీసీసీ నేత ఏఐసీసీకి చెప్పినట్టు సమాచారం.
ఎవరు పడితే వాళ్లు మాట్లాడవద్దు: కేసీ
రాష్ట్రంలోని చెలరేగిన రాజకీయ వివాదంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు నేతలకు ఫోన్లు చేసి ఆరా తీసినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షునితోపాటు, పార్టీ క్రమశిక్షణ కమిటీలో కీలకంగా ఉన్న నేతలకు ఆయన ఫోన్ చేసినట్టు సమాచారం. లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులను సరైన పంథాలో లీడ్ చేయకపోవటంతోనే ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితి ఎదురవుతున్నదని వారు కేసీ వేణుగోపాల్‌తో చెప్పినట్టు తెలిసింది. ఇలాంటి వైఫల్యాలు ఇకపై పునరావృతం కాకుండా టీపీసీసీ కట్టడి చేయాలని ఆయన సూచించినట్టు తెలిసింది. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాలసీలు, అప్పుల నివేదికలపై మాట్లాడేందుకు ఒకరిద్దరు అధికార ప్రతినిధులను లేదా మంత్రులను మాత్రమే కేటాయించాలని, మిగిలిన వారు తమ శాఖలకే పరిమితం కావాలని తాత్కాలిక ఆదేశాలిచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.