Congress | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో అద్భుత ప్రగతి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. ఉత్సవాలకు ఢిల్లీ పెద్దలను అతిథులుగా పిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముగింపు వేడుకకు అగ్రనేత సోనియాగాంధీ వస్తారని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమే ఆవిష్కరిస్తారని చెప్పారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్భాటంగా నిర్వహించిన ఉత్సవాల వ్యవహారమంతా బెడిసికొట్టినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉత్సవాలకు అధిష్ఠానం పెద్దలెవరూ రావడంలేదని తెలుస్తున్నది. తాము ఉత్సవాలకు హాజరుకాబోమని సోనియా, రాహుల్, ప్రియాంక స్పష్టంచేశారని సమాచారం. ఆహ్వానం అందించేందుకు కూడా ఢిల్లీకి రావొద్దని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. పిలిచినా రాలేదనే అపవాదు ఎందుకులే అని, అందుకే రాష్ట్రనేతలు ఢిల్లీ పెద్దలకు ఆహ్వానం కూడా అందించలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొంతకాలం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లినప్పుడు అధిష్ఠానం పెద్దల అపాయింట్మెంట్ ఉండేది. కానీ కొన్ని నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కాంగ్రెస్‌వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇతర రాష్ర్టాల ఎన్నికలపై జరిగే సమీక్షలోనో, పార్లమెంట్లోనో, ఏదైనా వేడుకలోనో అగ్రనేతలను కలుసుకోవడం తప్ప… ప్రత్యేకంగా రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలను కలుసుకోక చాలాకాలమైంది. ఎందుకంటే.. రాష్ట్రంలో పాలనపై రాహుల్, ప్రియాం క తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఆరు గ్యారెంటీల అమలు, హామీ మేర కు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయంతో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. పథకాల్లో కోతల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సంగతి కూడా అధిష్ఠానానికి నివేదికల రూపం లో అందిందని కాంగ్రెస్‌లోని సీనియర్నేతలే చెబుతున్నారు. తెలంగాణలో మాట తప్పడంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, అక్కడ ఓటమికి రేవంత్‌రెడ్డి పాలన కూడా ఓ కారణమైందనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని విజయోత్సవాలు జరపడమేంటని గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలకు హాజరయ్యే ప్రసక్తే లేదన్నట్టు సమాచారం.
రేవంత్‌రెడ్డి పాలన తీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్ఠానం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై మరింత ఆగ్రహం వ్యక్తంచేసినట్టుగా తెలిసింది. సర్కారు నిర్ణయం, ప్రజల స్పందనపై ఆరా తీసిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డట్టు సమాచారం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ తెలంగాణ ప్రజలకు సుపరిచితంగా ఉన్న విగ్రహంలో మార్పులు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టిపెట్టకుండా విగ్రహాల మార్పుపై ఫోకస్ చేయడంపై రేవంత్‌రెడ్డికి క్లాస్ పీకినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్టు అనాలోచిత నిర్ణయాలేంటని నిలదీసినట్టు తెలుస్తున్నది. ఉత్సవాలకు మేం రాలేం.. మీరే కానివ్వండి అని తేల్చిచెప్పినట్టు సమాచారం.