హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈటల, కోమటిరెడ్డి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యవహార శైలిపై వారు మరోసారి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అధ్యక్ష బాధ్యతలకు ఆయన అర్హుడు కాడని, వెంటనే తప్పించాలని డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు కొన్నాళ్లుగా లీకులు ఇస్తున్నట్టుగా తనకు ఏదో ఒక పదవి ఖాయం చేయాలని ఈటల కోరినట్టు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వారాల్లోగా రాష్ట్రంలో ఏదో ఒక చర్య జరగాలని వారిద్దరూ అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. దీనిపై పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. అందుకే బయటికి వచ్చిన తర్వాత ఇద్దరూ ముభావంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరోవైపు వారిద్దరి వ్యవహార శైలిపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ మాదిరి బెదిరింపులకు దిగడం ఏమిటని గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అత్యవసరంగా ఢిల్లీకి రావాలంటూ బండి సంజయ్‌కి కబురు వచ్చింది. దీంతో ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రధానంగా పార్టీలో అంతర్గత వివాదాలపైనే చర్చించే అవకాశం ఉన్నది. రాష్ట్రస్థాయిలో సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో బండి సంజయ్‌ని గట్టిగా ప్రశ్నించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈటల, కోమటిరెడ్డి వ్యవహారంపైనే వారు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి ఎందుకు బీజేపీలో చేరలేదో వివరణ అడిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈటల వైఫల్యం వల్లే వారు చేరలేదని బండి సమాధానం ఇస్తారన్నది బహిరంగ రహస్యమని కూడా అంటున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నదని బలంగా ప్రచారం జరుగుతున్నది.