హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ నుంచి ముఖ్యమైన నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండటంపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ‘భారీగా చేరికలు’ ఉంటాయని గప్పాలు కొట్టారు.. తీరా చూస్తే ఒక్కరు వస్తే ఇద్దరు వెళ్లిపోతున్నారు.. అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి సునీల్ బన్సల్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తలలు పట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత రెండు వారాల్లో పరిస్థితిని గమనిస్తే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు.
అదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, దాసోజు శ్రవణ్ వంటివారు పార్టీని విడిచి వెళ్లిపోయారు. వందల మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఇటీవల ఈటల రాజేందర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘పార్టీలోకి వరుసగా నేతలను తీసుకొస్తారనుకొని చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇస్తే.. చేరికలు వేరే పార్టీలో జరుగుతున్నాయి’ అంటూ విమర్శించినట్టు సమాచారం. ముఖ్యంగా బీసీ నేతలంతా పార్టీని వీడుతుండటంతో ‘బీసీ వ్యతిరేక పార్టీ’ అని మచ్చపడేలా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బీసీ నేతలకు గౌరవం ఇవ్వరనే సంకేతాలు వెళ్తున్నాయని చెప్పినట్టు సమాచారం.
మునుగోడుపై ఎన్నాళ్లీ కహానీలు?
మునుగోడులో పార్టీ పరిస్థితిపైనా అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరితే కాంగ్రెస్ ఓటుబ్యాంకు మొత్తం బీజేపీకి మళ్లుతుందని, విజయం ఖాయమని రాష్ట్ర నేతలు ఢిల్లీలో చెప్పారు. తీరా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి, రాజీనామా చేయించిన తర్వాత ‘టీఆర్ఎస్తో పోల్చితే 6-10 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. త్వరలో నంబర్ 1కు వస్తాం’ అని చెప్పినట్టు సమాచారం. అప్పటి నుంచి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నా.. రాష్ట్ర నేతలు మాత్రం ప్రతిసారి 5-10 శాతం మధ్య అంకెలు చెప్తున్న ట్టు తెలిసింది. దీంతో ఇంకా ఎన్నిరోజులు క థలు చెప్తారంటూ ఢిల్లీ పెద్దలు బండి సంజ య్, తరుణ్ చుగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
త మ అంతర్గత సర్వేల్లో మూడో స్థానానికి పరిమితమవుతున్నట్టు తేలిందని షాక్ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా మునుగోడులోనే మకాం వేశారని, అయినా ఎందుకు మూడో స్థానానికే పరిమితం అవుతున్నామో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఏదో అద్భుతం చేస్తాడని నమ్మి సునీల్ బన్సల్‌కు బాధ్యతలు అప్పగించామని, ఆయన వారాలుగా అక్కడే తిష్టవేసినా పెద్దగా మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మునుగోడులో ఓడిపోతే ప్రక్షాళన తప్పదని.. అనేకమంది పదవులు ఎగిరిపోతాయని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.