హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ): కండ్ల ముందు అద్భుతాలున్నా అధ్యయనాల పేరిట ఖండతరాలకు వెళ్లి మరీ తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సియోల్ పర్యటనలో భాగంగా సంగాయ్-డోంగ్‌లో కొత్త వ్యర్థాల దహన ప్లాంట్ ప్రాజెక్టును మంత్రులు, అధికారుల బృందం సందర్శించింది. రోజూ 1000 టన్నులు వచ్చే వ్యర్థాల ప్లాంట్‌ను పరిశీలించింది. అయితే, ఇంతకంటే గొప్ప ప్లాంట్ మన హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడకు రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్త వస్తుంది. ఆగస్టు 2020 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 17.6 లక్షల టన్నుల చెత్త నుంచి దాదాపు 600 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటును ఉత్పత్తి చేసి సంపదను సృష్టించారు. ఇదంతా కేసీఆర్ ఘనత.
ఆరు కేంద్రాల ద్వారా 101 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జవహర్‌నగర్, దుండిగల్ ప్లాంట్లను నెలకొల్పింది. జవహర్‌నగర్ ఫేజ్-2 (24 మెగావాట్ల), ప్యారానగర్(12), యాచారం (12), బీబీనగర్ (11) కేంద్రాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు జంట నగరాల నలుమూలల నుంచి 7,760 టన్నుల వ్యర్థాలను తరలిస్తుండగా, 3,768 టన్నుల పొడి చెత్తను వేరే చేసి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 579 లీచ్డ్ వ్యర్థాలు, 1,165 టన్నుల ప్లాస్టిక్, 336 టన్నుల సేంద్రియ ఎరువు బయటకు వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి పొడి చెత్త ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేస్తూ సంపదను సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో కండ్ల ముం దున్న అద్భుతాలను వదిలేసి, సామర్థ్యం తక్కువగా ఉన్న వ్యర్థాల ప్లాంట్‌ను సందర్శించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.