CPGET | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పీజీ ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) సీట్ల కేటాయింపు ఆలస్యంకానుంది. ఇటు వర్షాలతోపాటు, ఇంకా పీజీ ఫస్టియర్లోని విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో ఫస్టియర్ విద్యార్థులకు సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. సీపీగెట్ మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం 4న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే ఇది అనుమానంగానే కనిపిస్తున్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ నాలుగైదు రోజులు ఆగి సీట్లను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.
278 పీజీ కాలేజీల్లో 44వేలకు పైగా సీట్లుండగా, ఈడబ్ల్యూఎస్ సీట్లను కలుపుకుంటే వీటి సంఖ్య 50వేలకు చేరుతుంది. ఈ ఏడాది 73వేల మంది దరఖాస్తు చేసుకోగా, 61వేల మంది (94,.57శాతం) క్వాలిఫై అయ్యారు. కొంత కాలంగా పీజీ కోర్సుల్లో సీట్లు నిండటంలేదు. ఏటా 45శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయి. ఈ ఏడాది క్లినికల్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు పలు కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో ఆయా కోర్సుల్లో స్పల్పంగా సీట్లు పెంచుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై వర్షాల ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం తలెత్తిన నేపథ్యంలో మొదటి విడత షెడ్యూల్‌ను అధికారులు సవరించారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, మంగళవారం వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. 4,5 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదుకు, 6న సవరణకు అవకాశామిచ్చారు. 9న సీట్లు కేటాయిస్తారు. 10 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. కొన్ని ఎం ఫార్మసీ సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంతవరకు అనుమతివ్వలేదు.