Chalo Secretariat | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వ తీరును వ్యతిరేకించడం, ఆందోళనబాట పట్టడం చూస్తుంటాం. విద్యార్థి సంఘాలు స్కాలర్షిప్లు ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు, ముట్టడిలు చేపట్టడం గమనిస్తుంటాం. కానీ, ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వతీరును వ్యతిరేకించడం కాంగ్రెస్ పాలనలోనే కనిపిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు శనివారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. తొలుత ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టి, ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి సచివాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి.
రూ.4 వేల కోట్ల బకాయిలు..
ప్రభుత్వం నుంచి దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉన్నది. టోకెన్లు జారీ అయినా విడుదలకానివి రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. వీటి కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రోడ్డెక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండుసార్లు స్వచ్ఛందంగా కాలేజీల బంద్ పాటించాయి. ఓసారి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశాయి. అప్పట్లో ప్రభుత్వహామీతో యాజమాన్యాలు శాంతించాయి. మొత్తం బకాయిలు విడుదల చేయకపోవడంతో మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. తాజాగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రాక్టికల్స్‌ను బహిష్కరించాయి. మార్చి 5 నుంచి జరిగే థియరీ పరీక్షలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్, ఒకేషనల్ కాలేజీల యాజమాన్యాలు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై గుర్రుగా ఉన్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం..
ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు పేరుకుపోవడం, మరోవైపు పైసా విడుదలకాకపోవడంతో కాలేజీల యాజమాన్యాల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు సహకరించమని తెగేసి చెబుతుండడంతో ఆ పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి.