హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘విజయోత్సవ సభలకు, పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ మాకు ఇచ్చేందుకు ఉండవా?’ అంటూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేమని కాలేజీ యాజమాన్యాలకు అధికారులు సర్దిజెప్పే ప్రయత్నం చేయడంతో పై విధంగా స్పందించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు తలపెట్టిన కాలేజీల బంద్ రాష్ట్రమంతటా విజయవంతమయ్యింది. ఓయూ పరిధిలో మాత్రం విఫలమయ్యింది.
యాజమాన్యాలు తలోదారి అన్నట్టుగా వ్యవహరించడంతో ఉస్మానియా పరిధిలో కాలేజీలు యథాతథంగా నడవగా, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. డిగ్రీ కాలేజీల బంద్ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ మంగళవారం పలు దఫాలుగా కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమయ్యాయని, మంగళవారం నుంచి డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతున్నాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ చెప్పారు.
మంగళవారం ఓయూ పరిధిలో కాలేజీలు యథాతథంగా నడవగా, ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి. అయితే బంద్, యాజమాన్యాల హెచ్చరికల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి వర్సిటీలకు కీలక ఆదేశాలిచ్చింది. ఓయూ మినహా మిగతా వర్సిటీల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను 26 నుంచి ప్రారంభించాలని సూచించింది. ఓయూ మినహా మిగతా వర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభయ్యే ఈ నెల 26లోగా ఏదో ఒకటి తేల్చాలని, లేకపోతే మళ్లీ బంద్కు దిగుతామని కాలేజీల యాజమాన్యాలు అధికారులను హెచ్చరించినట్టు తెలిసింది. 23లోపు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకుని, సీఎం వద్దకు యాజమాన్యాలను తీసుకెళతామని అధికారులు హామీనివ్వడంతో యాజమాన్య సంఘం నేతలు ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు.