Degree Admissions | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘సీట్లు ఎక్కువ.. చేరే వారు తక్కువ. ఏటా 50శాతంలోపే అడ్మిషన్లు. 50కిపైగా కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు’ వాస్తవ పరిస్థితులిలా ఉంటే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇది వరకు నాలుగైదు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా, ఇక నుంచి రెండు విడతలకే పరిమితం చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం కల్పించొద్దని పేర్కొంది.
శుక్రవా రం జరిగిన వైస్చాన్స్లర్ల సమావేశంలో డిగ్రీ అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేయగా, జూన్ 16 నుంచే ఫస్టియర్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించారు. 2024-25లో ఫస్టియర్‌లో 4,57,704 సీట్లుండగా, 1,96,442 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 2.61లక్షల సీట్లు మిగిలాయి. చాలా కాలేజీల్లో 10-15 మంది మాత్రమే చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్లు లేక కునారిల్లుతున్నాయి. నాలుగైదు విడతల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తేనే ఇలా ఉంటే.. మరీ రెండు విడతల్లోనే పూర్తిచేస్తే అడ్మిషన్లు మరింత తగ్గిపోయే ప్రమాదమున్నది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూలైలో విడుదలవుతాయి. ఎప్‌సెట్ కౌన్సెలింగ్ పూర్తికావాలంటే జూలై గడిచిపోతుంది. జేఈఈ కౌన్సెలింగ్ తర్వాత మరో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బీ ఫార్మసీ కౌన్సెలింగ్ ఆగస్టు, సెప్టెంబర్‌లో పూర్తవుతుంది. మరీ జూన్‌లోనే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తిచేస్తే బీటెక్, బీ ఫార్మసీ, లా కోర్సులు, ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు రాని, సప్లిమెంటరీ విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిందేనా..? అని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.