హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, రక్షణ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర వివక్ష ప్రదర్శించింది. మన రాష్ర్టానికి దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు మంజూరు చేసింది. తెలంగాణలో గతంలో ఏర్పాటైన అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు తోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెద్ద ఎత్తున కొలువుదీరాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్-బెంగుళూరు మార్గంలో డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేయాలని మన రాష్ట్రం దీర్ఘకాలం నుంచి కోరుతున్నది.
కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్‌కు మద్దతు ఇస్తున్నది. ప్రపంచస్థాయి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో తెలంగాణ దేశంలోనే ఓ ప్రధాన కేంద్రంగా నిలిచింది. తద్వారా రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు మన రాష్ట్రం ఎంతగానో దోహదపడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిభట్ల, మహేశ్వరం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఎస్ఈజెడ్తోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అనేక విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.
క్షిపణులతోపాటు రక్షణ రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా ఆవిర్భవించింది. దేశీయ రక్షణ రంగ అవసరాలను తీర్చడమే కాకుండా తెలంగాణ నుంచి పలు ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. బలమైన ఎకోసిస్టం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ కంపెనీల భాగస్వామ్యం తదితర అనుకూలతలు ఉన్నప్పటికీ మన రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు ఉన్న అనుకూలతలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి వివరించి డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేయాలని కోరింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం మరోసారి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి హైదరాబాద్-బెంగుళూరు మార్గంలో రక్షణ కారిడార్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
కానీ, తెలంగాణ వినతులను ఏమాత్రం పట్టించుకోని కేంద్రం ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు రక్షణ కారిడార్‌ను మంజూరు చేసింది. బుందేల్‌ఖండ్‌లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడితో 3వేల ఎకరాల్లో డిఫెన్స్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పరిశ్రమలు నెలకొల్పేవారికి కేంద్రం భారీగా ప్రోత్సాహకాలను కల్పించడంతోపాటు 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. బుందేల్‌ఖండ్ డిఫెన్స్ కారిడార్‌కు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 2.5లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.