హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బినామీలతో రూ.కోట్ల విలువైన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. అది చేసిన సబ్‌రిజిస్ట్రార్‌పై పదేండ్ల క్రితమే ఏసీబీలో కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నారు. బాధితులు ఆర్వోసీకి ఇచ్చిన ఫోర్జరీకి సంబంధించిన అంశంపై హైదరాబాద్ సీసీఎస్‌కు లేఖ అందింది. ఈ ఫోర్జరీ అంశంపై పోలీసులు బాధితులను గుర్తించి వారినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అందులో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యే హైదరాబాద్‌కు చెందిన ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే వియ్యంకుడే కోట్ల రూపాయల విలువైన స్థలాలను కాజేందుకు కుట్రచేశాడనే విషయం బయటకు వచ్చి, ఇప్పుడు సంచలనంగా మారింది.
బాధితుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన చామర్తి మురళీకృష్ణారావు, మాగపు సత్యవెంకట సుబ్రహ్మణ్య దుర్గాప్రసాద్ 1956 కంపెనీ చట్టప్రకారం 2010లో ‘యూ2 ఎగ్జిమ్ ప్రై వేట్ లిమిటెడ్’ పేరుతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామం చిరునామాతో స్థాపించాచిన కంపెనీలో ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారుచేస్తుంది. అప్పట్లోనే ఏపీఐసీసీ ఈ కంపెనీకి 17,188 చదరపు మీటర్ల భూ మి (సుమారు 4.24 ఎకరాలు) కేటాయించింది. 2014 వరకు సజావుగా సాగింది.
అప్పటికే మరో వ్యవస్థాపక డైరెక్టర్‌గా దుర్గాప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత విస్తరణ కోసం ఆర్థిక అవసరాలు ఏర్పడటంతో 2014లో గోవింద్ప్రసాద్ గార్హియా, అతని కొడుకు నిషాంత్రాజ్ వద్ద కంపెనీ భూమి పత్రాలు తాకట్టు పెట్టి రూ.5 కోట్లు రుణం తీసుకొన్నారు. అందుకు బినామీలుగా ఉన్న సీలం దయాకర్‌రెడ్డి, ఆయన భార్య పావనిని కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమించాలని కోరడంతో నిర్వాహకుడైన మురళీకృష్ణారావు ఒప్పుకొన్నారు.
కంపెనీకి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఫిల్లింగ్‌స్టేషన్ సమీపంలో సుమారు 6 ఎకరాల స్థలం ఉండగా, అప్పట్లో కంపెనీ ఎండీ ఉమాశంకర్ మద్దూరి పేరుపై ఉన్నది. దానిపక్కనే ఫిరాయింపు ఎమ్మెల్యే వియ్యంకుడైన అనిల్‌కుమార్ కిషన్‌కు చెందిన స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని తమకు విక్రయించాలని 2015లో పలుమార్లు బాధితులను అడిగారు. ఇంతలో కంపెనీలో డైరెక్టర్ల వివాదం నడుస్తున్నదని గుర్తించారు. దానిని పరిష్కరించేందుకు తన అనుచరుడైన కూకట్‌పల్లికి చెందిన నరేశ్చౌదరిని పంపించారు. గోవింద్ప్రసాద్, దయాకర్‌రెడ్డి సమస్యను పరిష్కరిస్తానని, తనను కంపెనీలో డైరెక్టర్‌గా చేర్చాలంటూ నరేశ్చౌదరి కం పెనీ వ్యవస్థాపక డైరెక్టర్ అయిన మురళీకృష్ణారావును కోరడంతో దానికి ఆయన అంగీకరించారు.
కొన్ని రోజులపాటు నరేశ్చౌదరి డైరెక్టర్‌గా కొనసాగి, సమస్యను పరిష్కరించకపోవడంతో స్వచ్ఛందంగా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఒక పథకం ప్రకా రం రాజీనామా చేసిన తరువాత 3 నెలలకు శంషాబాద్ స్థలాన్ని కొట్టేసే కుట్ర అమలు చేశారు. కంపెనీకి తానే మేనేజింగ్ డైరెక్టర్‌నంటూ చెప్పుకొని పాత తేదీలతో మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే వియ్యంకుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ కుదరకపోవడంతో 2015లోనే ఎల్బీనగర్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి ఎస్ఆర్వో రమేష్శ్చంద్రారెడ్డితో కుమ్మక్కై ఈ స్థలాన్ని అనిల్‌కుమార్ కిషన్, ఆయన భార్య పద్మజ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై అసలైన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ రంగప్రవేశం చేసింది. ఎస్ఆర్వోతోపాటు నకిలీలకు చెందిన వారిపై కేసు నమోదు చేసింది.
కంపెనీకి సంబంధించిన ఫోర్జరీల ఆర్వోసీని మోసంచేయడం ఒకవైపు, రాజకీయ బలంతో కేసుల్లో ఉన్న విలువైన స్థలాన్ని కాజేసేందుకు మరోపక్క పదేండ్లుగా కుట్రలు జరుగుతున్నాయి. ఇటీవల బాధితులకు బెదిరింపులు పెరిగాయి, వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ వియ్యంకుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం కంపెనీ యజమాన్యం ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఈ ఫోర్జరీల విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపాలంటూ ఆర్వోసీని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా సీసీఎస్‌కు లేఖ రాసింది, ఆ లేఖ ఆధారంగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న సీలం దయాకర్‌రెడ్డి దంపతులు నెమ్మదిగా అసలైన డైరెక్టర్ మురళీకృష్ణారావును పక్కకు తప్పించేందుకు భారీ కుట్ర చేశారు. నకిలీ పత్రాలు, అసలైన డైరెక్టర్ సంతకాలు, బొటనవేలు ముద్రలు నకిలీవి తయారుచేశారు. ఈ ఫోర్జరీ సంతకాలతో అసలైన కంపెనీ యజమాని మురళీకృష్ణారావు కంపె నీ నుంచి బయటకు వెళ్లిపోయాడని ఆర్వోసీలో అప్లోడ్ చేశారు. నకిలీ డిజిటల్ సంతకాలు సృష్టించి కంపెనీ షేర్ హోల్డర్స్ నమూనాను మార్చి పూర్తిగా వారి వివరాలను అందులో పొందు పరిచి కంపెనీని అక్రమంగా స్వాధీనం చేసుకొని, పూర్తిగా నష్టాల్లోకి నెట్టేశారు.