నాంపల్లి కోర్టులు, జూలై 6 (నమస్తే తెలంగాణ): పరువు నష్టం కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ నేతలకు అండగా నిలిచేందుకు వారి నుంచి బహుమతులను స్వీకరించానని, ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్ కారును బహుమతిగా పొందానని ప్రభాకర్ ఓ టీవీ చానల్ చర్చలో ఆరోపించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఆమె పేర్కొంటూ.. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పార్థాభౌమిక్, శుభలక్ష్మిని ఆ పిటిషన్లో సాక్షులుగా చేర్చారు.
ఈ కేసులో ప్రభాకర్ నుంచి రూ.10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ.. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించారు. తనకు కారును బహుమతిగా ఇచ్చిన వ్యక్తి పేరును వెల్లడించాలని లీగల్ నోటీసులు పంపినప్పటికీ ప్రభాకర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ఇటీవల దీపాదాస్ మున్షీ వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశాక కోర్టు ఈ కేసును రిజస్టర్ చేయనున్నది.