హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. మంత్రి పదవుల మీద కోటి ఆశలు పెట్టుకొని 17 నెలలుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలను అధిష్ఠానం తీవ్ర నిరాశకు గురిచేసింది. కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని అండగా నిలిచిన నేతలను పక్కనపెట్టి గోడదూకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇతర పార్టీలు నుంచి వచ్చిన 50 శాతంమందికి తొలి విడతలో మంత్రి పదవు లు ఇచ్చినా, పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని కాపాడుకోవాలన్న ఆలోచనతో అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించామని చెప్తున్నారు.
మలిదశ విస్తరణలోనైనా పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం కల్పిస్తారనుకుం టే ఇప్పుడూ అలాగే చేశారని ఆవేదన చెందుతున్నారు. 17 నెలలుగా ఆరు క్యాబినెట్ బెర్తు లు ఖాళీగా ఉండగా మంత్రివర్గ విస్తరణ అం శం తెరమీదపైకి వచ్చిన ప్రతిసారీ సామాజిక సర్దుబాట్లు, వర్గపోరు తదితర కారణాలతో 32సార్లు ఆగిపోయింది. ఇప్పుడు మూడుస్థానాలు భర్తీచేసి మరో మూడింటిని ఖాళీగా ఉంచడంపై నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈసారి రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నుంచి కనీసం ఒక్కరికైనా అవకాశం దకుతుందనే ప్రచారం సాగింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పీ సుదర్శన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే, వారికి నిరాశే ఎదురైంది.
మంత్రి పదవి దక్కకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఒకే ఇంట్లో నుంచి రెండు పదవులు ఇవ్వలేమని చెప్తే, వివేక్ కుటుంబంలోని మొత్తం ముగ్గురికి పదవులు ఇచ్చారని, వివేక్ కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీగా, ఆయన అన్న వినోద్‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఇప్పుడు వివేక్‌కు మంత్రి పదవి కూడా ఇచ్చారని, ఒక్క కుటుంబానికే ఇన్ని పదవులు ఎలా ఇచ్చారని మీనాక్షి నటరాజన్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. దీంతోపాటు పార్టీ లో సైకిల్ కాంగ్రెస్ వారి హవానే కొనసాగుతున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి, సీతక్క వంటివాళ్లకు పదవులు ఇచ్చినపుడు తనలాంటి కాంగ్రెస్ వీరాభిమానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినట్టు సమాచారం. వలస వచ్చినవారికి, వెన్నుపోటుదారులకు పదవులు ఇచ్చి తమ గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
పార్టీ అధిష్ఠానం మంత్రివర్గంలో ముగ్గురి పేర్లు ప్రకటించిన వెంటనే మంత్రివర్గంలో స్థానం ఆశించినవారు ఖిన్నులయ్యారు. ము ఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పార్టీ తమను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారిని తమదారిలో తెచ్చుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ ప్రయత్నించారు. అందరికీ స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఈసారి మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి దక్కడంతో విచిత్రంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ముగ్గురు మంత్రులయ్యారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో మొండిచెయ్యి చూపారు. చేవెళ్ల, బాన్సువాడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, అరికపూడి గాంధీ మంత్రి పదవి ఆశించారు. కానీ, వీరెవరికీ మంత్రి పదవులు దక్కలేదు.
మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షినటరాజన్ ఆశావహుల ఇండ్లకు పరుగులు తీశారు. రేవంత్ ఫోన్లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తే, మీనాక్షి నటరాజన్ స్వయంగా సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేంసాగర్‌రావు తదితరులతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి నుంచే బుజ్జగింపులు జరిపారు.