హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్డంకిగా మారాయి. రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో రెండింటికి హాజరయ్యే వారికి కొత్త చిక్కు వచ్చిపడింది. డీఈఈసెట్ ఎగ్జామ్ ఈ నెల 25న ఉదయం, మధ్యా హ్నం రెండు పూటలా నిర్వహించనున్నారు.
అదే రోజు మధ్యా హ్నం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గణితం పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2కు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సెకండియర్వారు సైతం డీఈఈసెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. ఇంటర్ ఫెయిలైన వారితోపాటు, ఇంప్రూవ్మెంట్ రాసే వారికి రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో ఏదో ఒక పరీక్ష రాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు చొర వ తీసుకొని ఏదో ఒక పరీక్షను వాయిదావేయాలని, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.