హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గౌడన్నల, కల్లుగీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ సర్కార్.. రాత్రికి రాత్రే సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్నది. అప్పటికప్పుడే ఆగమేఘాలపై ఆహ్వాన పత్రికలు పంపించనట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటు విషయం.. తొలుత కాంగ్రెస్ సర్కార్‌కు ఇష్టం లేదన్నట్టుగా తెలిసింది. పాపన్నగౌడ్ 375వ జయంతిని మొక్కుబడిగానే అధికారికంగా నిర్వహించి వదిలేద్దామనే ఆలోచనలో మొన్నటివరకూ ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రభుత్వ వైఖరి గౌడన్నలకు, కల్లుగీత కార్మికులకు వ్యతిరేకంగా మారుతున్నది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా గౌడన్నలు ఆగ్రహంతో ఉన్నారన్న సమాచారం ప్రభుత్వ పెద్దలకు చేరుతూనే ఉన్నది. ఈ క్రమంలో పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే గౌడన్నల ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గ్రహించినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ హయాంలోనే స్థలం,నిధుల కేటాయింపు
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో పోరాటాలు జరుగుతున్నాయి. దీంతో విగ్రహ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా, పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుపై తాత్సారం చేస్తూ వచ్చింది. దీనిపై మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచారు. ఈ నేపథ్యంలోనే గత శనివారం శ్రీనివాస్‌గౌడ్, గౌడ నేతలు కలిసి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకో సం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే గత ప్రభు త్వం విగ్రహానికి, స్థలానికి విడుదల చేసిన నిధులకు సంబంధించిన జీవో కాపీని చూపుతూ నినాదాలు చేశారు. ఈ అంశాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుండటం తో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తేరుకొని, స్వ యంగా సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి, మొత్తం పరిస్థితిని వివరించినట్టు తెలిసింది.
రాత్రికి రాత్రే ఏర్పాట్లు
మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ సూచనతో తేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని తుది నిర్ణయానికి వచ్చారని తెలిసింది. దీంతో విగ్రహం ఏర్పాటు చేయాలని శనివారం రాత్రే నిర్ణయం తీసుకొని, ఆగమేఘాలపై బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను స్థల పరిశీలనకు పంపారని తెలిసింది. వారు గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న స్థలం వద్ద కాకుండా, మరోచోటును నిర్ణయంచారు. ఆ తర్వాత ఆహ్వానానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగాయి. రాత్రికి రాత్రే ఆహ్వాన పత్రికలు తయారు చేయించినట్టు తెలిసింది. విగ్రహ ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో తీసుకొని, తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి.. గౌడ కులస్థులకు మేలు చేసే అంశాలను ప్రకటిస్తారని ఆశించారు. కానీ, ఎలాంటి ప్రకటన చేయలేదు.