హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా మత్స్యకారుల ప్రాథమిక సహకార సంఘంలో ఖాజీపూర్ మత్స్యకారుల ముదిరాజ్ సంఘానికి సభ్యత్వం కల్పించాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు జిల్లా మత్స్యశాఖ సహాయ డైరెక్టర్‌ను ఆదేశించింది. వారంలోగా సహాయ డైరెక్టర్‌కు నిర్ధిష్ట నమూనాలో వినతి పత్రాన్ని అందజేయాలని ఖాజీపూర్ ముదిరాజ్ సంఘానికి సూచించింది. దీనిపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సహాయ డైరెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మత్సకార సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఖాజీపూర్ మత్సకారుల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పీ గణేశ్, కార్యదర్శి పీ భూపతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్ శ్రవణ్‌కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.