నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, నిరుపేదలకు మొండిచేయి చూపారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసేందుకు ప్రత్యేకాధికారి శివరాంప్రసాద్, కార్యదర్శి మహేశ్వరి రాగా నారాయణపురం, పెంచికల్‌పాడ్, నెమలిపేట, సూర్యంపేట, జగన్నాధపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. పేదలకు ఇండ్లు మంజూరు చేసేవరకు సర్వే చేయొద్దని తేల్చిచెప్పారు. అశ్వారావుపేట ఎమ్మె ల్యే జారే ఆదినారాయణ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ కమిటీ చెప్పిన వారికే ఇండ్లు వచ్చాయని ప్రత్యేకాధికారి వినయ్, పంచాయతీ కార్యదర్శి శివపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులను ఎంపిక చేశారని పంచాయతీ కార్యదర్శి, గుమస్తాను పంచాయతీ కార్యాలయం లోపల ఉంచి తాళం వేశారు.
అధికారులే న్యాయం చేయాలి అని కోరుతూ ఖమ్మంరూరల్ మండల పరిషత్ కార్యాలయానికి ఆరెకోడు తండాకు చెందిన బాధితులు క్యూ కట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని కనకయ్య వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నంచేశాడు. నల్లగొండ జిల్లా చండూరు మం డలం నెర్మటకు చెందిన పాలడుగు ముత్తమ్మ తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిం ది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండ లం ధీరావత్‌తండాలో పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి సాయికుమార్‌పై కాంగ్రెస్ నాయకుడు పానుగోతు నాగురాజు తనకు తెలియకుండా గ్రామంలో ఎందుకు సర్వే చేస్తున్నావని దాడికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాదిజమ్మికుంటకు చెందిన దివ్యాంగుడు దొంకటి కోటేశ్వర్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన తెలిపాడు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో మహిళలు రోడ్డెక్కారు.