హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ‘మా ప్రభుత్వం ఇకపై అప్పులు చేయదలుచుకోలేదు’ అని ఆదివారం వరంగల్లో సీఎం రేవంత్రెడ్డి చేప్పినప్పటికీ అవన్నీ ఒట్టి మాటలేనని ఆర్థిక నిపుణులు కొట్టిపారేస్తున్నారు. సీఎం చేస్తున్న వ్యాఖ్యలకు, బడ్జెట్లో ప్రభుత్వ ప్రణాళికలకు సంబంధమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు రూ.3.15 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లీకులు ఇచ్చింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే దాదాపు రూ.24 వేల కోట్లు ఎక్కువ. సాధారణంగా రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో సొంత పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం బడ్జెట్లో ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటితోపాటు ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే రుణాలను కలిపి రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనాలను రూపొందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రుణాలు కాకుండా రెవెన్యూ రాబడులను రూ.2.21 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కానీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సమర్పించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి అన్ని మార్గాల ద్వారా ప్రభుత్వానికి రూ.1.24 లక్షల కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 56% మాత్రమే. దీంతో మిగిలిన రెండు నెలలు కూడా కలిపితే రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1.60 లక్షల కోట్లలోపే ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.2 లక్షలలోపే బడ్జెట్ పెడతారా?
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయదలుచుకోలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్తున్న మాట నిజమే అయితే రెవెన్యూ రాబడుల ఆధారంగా మాత్రమే బడ్జెట్ రూపొందించాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్బీఎం పరిమితిలో వచ్చే రుణాలను కూడా తీసుకోకూడదు. ఈ లెక్కన 2025-26 బడ్జెట్ రూ.2 లక్షల కోట్లలోపే ఉండాలి. కానీ, సుమారు రూ.3.15 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. గత బడ్జెట్లో రూ.2.21 లక్షల కోట్లుగా అంచనా వేసిన రెవెన్యూ రాబడులను ఈసారి రూ.2.40 లక్షల కోట్ల మేరకు పెంచబోతున్నట్టు సమాచారం. మిగిలిన రూ.75 వేల కోట్లను ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి రుణాల రూపంలో తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిమితి రూ.50 వేల కోట్లే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంతకుమించి రుణాలు తీసకున్నది. ఇదే తరహాలో ఈసారి జీఎస్డీపీ పెరగనున్నట్టు చూపించి ఏకంగా రూ.70-80 వేల కోట్ల రుణాలు సమీకరించాలని ప్లాన్ వేసినట్టు వినికిడి.
ఓవైపు బడ్జెటేతర రుణాలు.. మరోవైపు భూముల తనఖాలు, అమ్మకాలు
నిరుటి బడ్జెట్లో అంచనా వేసినంత ఆదాయం రాకపోవడంతో రోజువారీ నిర్వహణ, పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటేతర రుణాల వైపు మొగ్గు చూపింది. బడ్జెట్లో పేర్కొన్న రుణాలకు తోడు కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా బడ్జెటేతర రుణాలు సేకరించింది. అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం నిరుడు నవంబర్ నాటికే ప్రభుత్వం సుమారు రూ.61 వేల కోట్ల అప్పులు తీసుకుంది. ఇదే తరహాలో ఈ ఏడాది రూ.50 వేల కోట్ల వరకు బడ్జెటేతర రుణాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరోవైపు భూముల తనఖా, విక్రయాల ద్వారా భారీగా నిధులను రాబట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఇటీవల 400 ఎకరాలు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిని అమ్మడం ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని భూముల తనఖాలు, అమ్మకాల ద్వారా రూ.30 వేల కోట్ల వరకు సమీకరించుకోబోతున్నట్టు సమాచారం. ఇలా 2025-26లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.లక్షన్నర కోట్ల మేరకు అప్పులు చేసే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.