హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం గీతం పోషించిన పాత్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహనీయుల కృషి అద్భుతమని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి శ్లాఘించారు. వందేమాతరం కేవలం ఒక పాట కాదని, అది మన జాతి నిర్మాణ స్ఫూర్తి అని పేర్కొన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులు, భాషలు, మతాలను ఏకంచేసే జాతీయ స్ఫూర్తిని స్మరించుకోవడానికి వందేమాతర గీతం ఉపయోగపడిందని చెప్పారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గీతం 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో విప్లవ గీతంగా మారిందని గుర్తుచేశారు.
‘వందేమాతరం’ శక్తిని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఈ గీతాన్ని నిషేధించారని తెలిపారు. వందేమాతర గీతంపై మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 1938లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో వందేమాతరం నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆ నిషేధాన్ని నిరసిస్తూ వందేమాతరం గీతాన్ని ఆలపించారని తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొని కళాశాల నుంచి బహిషరణకు గురైన విద్యార్థుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఉన్నారని, ఆ ఘటనలు యువత స్వాతంత్య్ర ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచాయని చెప్పారు.
స్వాతంత్య్ర ఉద్యమానికి తెలుగు ప్రజలు కీలక సహకారాన్ని అందించారని, తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడే భారతీయులకు సొంత జెండా అవసరాన్ని గుర్తించారని చెప్పారు. దాదాపు 520 సంస్థానాలు, దేశ ప్రజలను ఏకం చేసేలా పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు వీరుల పోరాటాలను సురేశ్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు 1920లో గిరిజనులను ఏకంచేసి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారని, గోండు బిడ్డ కుమ్రం భీం తెలంగాణలో గోండుల హకుల కోసం పోరాడి ప్రసిద్ధ జల్, జంగల్, జమీన్ నినాదాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థ, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలు మల్లు స్వరాజ్యం అని చెప్పారు. తన భూమిని సాగు చేసుకునే హకు కోసం చాకలి ఐలమ్మ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి రైతు పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన సరోజినీ నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళగా, ఆపై రాష్ట్ర గవర్నర్‌గా దేశానికి సేవ చేశారని పేర్కొన్నారు. వందేమాతరం స్ఫూర్తిని మనం కేవలం మాటల్లోనే కాకుండా పాలనలో కూడా పాటించాలని, పేదరికం, కుల వివక్ష, లింగ వివక్ష నుంచి ప్రతి భారతీయుడికి విముక్తి కల్పించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి స్వయం పాలన కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, అవి భిన్న స్థాయిల్లో దేశ గమనాన్ని ప్రభావితం చేశాయని కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలను చట్టాలు ఎంతవరకు నెరవేరుస్తున్నాయి? సమాఖ్య స్ఫూర్తి ఎంతవరకు నిలబడుతున్నది? అనేది ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. నిజాం స్వతంత్ర పాలన కొనసాగించాలని భావించినప్పటికీ ఆపరేషన్ ‘పోలో’ ద్వారా 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని పేర్కొన్నారు. 1938లో మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక ద్రవిడ దేశం కోసం పెరియార్ నాయకత్వంలో పోరాటం మొదలైందని గుర్తుచేశారు.
భాషా ప్రాతిపదికన మెరుగైన పరిపాలన కోసం బ్రిటిష్ కాలంనాటి వర్గీకరణను మార్చి 1956లో భారతదేశాన్ని 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారని, దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, మైసూర్, మద్రాస్ లాంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, మహాగుజరాత్ ఉద్యమాల తర్వాత నాటి బొంబాయి రాష్ట్రాన్ని రద్దుచేసి ప్రత్యేక గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. 2000 సంవత్సరంలో పరిపాలనా సౌలభ్యం, స్థానిక వనరులపై నియంత్రణ కోసం ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రాంతీయ వివక్షపై నిరసనలు, రాజకీయ సమీకరణల కారణంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం (2009-14) తీవ్రరూపం దాల్చిందని, ఫలితంగా 2014లో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.