సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మరొకరు చనిపోయారు. పటాన్చెరు ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే కార్మికుడు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి ఉన్నది. పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు ఛిద్రమవై పరిశ్రమలోని యంత్రాలకు అతుక్కుపోయాయి. దీంతో తమవారి ఆచూకీ కోసం కార్మికుల కుటుంబ సభ్యులు సిగాచీ ఇండస్ట్రీస్ వద్ద పడిగాలు గాస్తున్నారు. ప్రమాదం సంభవించి ఏడు రోజులైనా కార్మికులను గుర్తించడంలో ఎలాంటి పురోగతి లేదంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 9 మందిలో ఇప్పటికే ముగ్గురు మృతిచెందారు. మిగిలిన ఆరుగురిలో ముగ్గురు 40 నుంచి 80 శాతానికిపైగా కాలిన గాయాలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం భీం రావు అనే కార్మికుడు మృతిచెందగా, శనివారం మరో కార్మికుడు మున్మున్ చౌదరి చనిపోయారు. తాజాగా మరో కార్మికుడు మరణించడంతో మరణాల సంఖ్య 41కి పెరిగింది.