హనుమకొండ సబర్బన్, ఆగస్టు 22: భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని.. అతని పేరిట ఉన్న ఇంటి జాగను అమ్ముకుని.. తిరిగి అతనిపైనే వేధింపుల కింద కేసు వేసింది ఓ భార్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్‌కు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెళ్లికి చెందిన నిర్మలతో 2008లో వివాహం జరిగింది.
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి 2013లో అక్కడి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల చట్టం 498 (ఏ) కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విషయంలో తిరుగుతున్న వినోద్.. ఇటీవల వరంగల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే ఒక లాయర్‌ను సంప్రదించాడు. వినోద్ తరఫు లాయర్ వివరాలు సేకరించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
2013 మార్చిలోనే నిర్మల వినోద్ మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నది. అదే ఏడాది సెప్టెంబర్‌లో 498 (ఏ) ఫిర్యాదు చేసింది. 2021లో వినోద్ పేరిట ఉన్న 150 గజాల భూమిని సైతం ఇతరులకు విక్రయించింది. ఈ ఘరానా మోసంపై బాధితుడు కాజీపేట పోలీసులను ఆశ్రయించగా.. ఇది ఇక్కడి అంశం కాదని, నేరం జరిగిన దగ్గర ఫిర్యాదు చేయాలని సూచించారు.
సాక్ష్యాలు చూసి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడి తరఫు లాయర్ తెలిపారు. ఈ విషయమై స్థానిక ఇన్స్పెక్టర్ సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా బాధితుడు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారిస్తామని వివరించినట్టు తెలుస్తున్నది.