కీవ్, సెప్టెంబర్ 18: రష్యా సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని కోజాచ లోపన్ ప్రాంతం రష్యా అకృత్యాలకు నిలువుటద్దంగా నిలిచింది. ఇటీవల ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ జల్లెడ పడుతున్నది. దీంతో విస్తుగొలిపే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికులను, పౌరులను రష్యా బలగాలు చిత్రహింసలకు గురిచేసి చంపిన తీరు.. అనంతరం సామూహిక ఖననం చేసిన విధానం బట్టబయలవుతున్నది. రష్యా అకృత్యాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి అధికారులు వీడియో తీస్తున్నారు. అయితే ఓ వైపు ఈ గాలింపు చేపడుతున్న సైనికులు.. మరోవైపు రష్యాతో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు.