Haryana | న్యూఢిల్లీ: మైపాల్ ధిల్లా అనే నేర చరిత్ర ఉన్న వ్యక్తి హర్యానాలోని ఝజ్జర్ (Jhajjar) జైలులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. ఇతడిని 2025లో కంబోడియా ప్రభుత్వం హర్యానాకు అప్పగించింది. కంబోడియాకు చెందిన తన భాగస్వామితో వివాహం చేసుకునేందుకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల (12 గంటలు) వరకు కస్టడీ పెరోల్‌ను మంజూరు చేశారు.
ఇదంతా సాధారణ విషయమే అయినా పెండ్లి కుమార్తె కంబోడియాకు చెందినవారు కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. మైపాల్ ధిల్లా గతంలో పెరోల్‌పై కంబోడియా వెళ్లినప్పుడు మెటా చాన్ (Meta Chan) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తరువాత వారు సహజీవనం చేశారు. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మెటా చాన్ మైపాల్ను వివాహం చేసుకునేందుకు కంబోడియా నుంచి ఒక బిడ్డను అక్కడే ఉంచి ముగ్గురు పిల్లలతో భారత్‌కు వచ్చారు.
మైపాల్పై మర్డర్‌తో సహా 22 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 2007, 2010లో నమోదైన మూడు కేసుల్లో దోషిగా తేలాడు. దీంతో మైపాల్‌కు జీవిత ఖైదు శిక్ష విధించారు. దీంతో హిసార్ (Hisar) జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2018, జూలైలో ఆరు వారాల పెరోల్‌పై విడుదలైన అతడు తరువాతి నెలలో సోను కుమార్ అనే నకిలీ పేరుతో దేశం విడిచి కంబోడియా పారిపోయాడు. అక్కడ వ్యాపారం ప్రారంభించి మెటా చాన్‌తో జీవిస్తున్నాడు.
హర్యానా పోలీసుల వినతి మేరకు 2024లో అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ (Red Notice) జారీ అయ్యేలా సీబీఐ (CBI) చర్యలు చేపట్టింది. దీంతో కంబోడియా పోలీసు అధికారులు 2025, జూలైలో అతడిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అతడిని కంబోడియా పోలీసులు భారత్‌కు అప్పగించారు.