యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుంభం చేరికతో భువనగిరి నియోజకవర్గంతోపాటు ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు మరింత సులభం కానున్నది. కుంభం అనికుమాల్రెడ్డికి జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతోపాటు జిల్లా పరిధిలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో సైతం ఆయనకు అనుచరులు ఉన్నారు. మరోవైపు నకిరేకల్ నియోజకర్గంలోని రామన్నపేటలో కూడా అభిమానులు ఉన్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, కుంభం కలిస్తే జిల్లాలో తిరుగుండదని స్వయంగా సీఎం కేసీఆరే ప్రగతిభవన్‌లో వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది.
కాంగ్రెస్ కకావికలం
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గత పదేండ్లుగా పార్టీ కోసం పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడి చేతిలో ఓటమిపాలైనప్పటికీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే భువనగిరి కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తున్నది. అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కుంభం ను దెబ్బతీసేందుకు కోమటిరెడ్డి భువనగిరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు నడిపారు. ఈ నేపథ్యంలోనే కుంభం కాంగ్రెస్‌ను వీడటంతో ఆ పార్టీలో కనీసం చెప్పుకోదగిన నేతలు కరువయ్యారు. ఇటు ఆలేరులోనూ బీర్ల అయిలయ్యకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కుడుదల నగేశ్, కల్లూరి రామచంద్రారెడ్డి, బండ్రు శోభారాణి, సంజీవరెడ్డి తదితర కీలక నేతలు రహస్య సమావేశం నిర్వహించడంతో అక్కడ కూడా వర్గపోతు పతాకస్థాయికి చేరింది. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.