ఐనవోలు, సెప్టెంబర్ 7: సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేసిన నయవంచకులేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా వెంకటాపురం నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేపట్టిన ‘రైతన్న కోసం రాజన్న పాదయాత్ర’ రెండో విడత కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పొద్దున లేస్తే అబద్ధ్దాలు ఆడుతాడని, కడియం శ్రీహరి తుపాకీ రాముడు చెప్పినట్టు ముచ్చట చాలాచక్కగా చెప్తాడని ఎద్దేవా చేశారు. దేవాదులలో నీళ్లు పారించిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 12 ఏండ్ల క్రితం ఆగిపోయిన దేవాదుల కాలువకు నీళ్లు తేవడానికి రూ.250 కోట్లు ఉన్న అంచనాను రూ.350 కోట్లకు పెంచి సుమారు 75 శాతం పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
12 ఏండ్ల తర్వాత రూ.100 కోట్లకు పెంచితేనే అప్పుడు ఆ నాయకులు విమర్శించారని, మరి ఇప్పుడు రెండేండ్లలోనే రూ.350 కోట్లు ఉన్న అంచనాను రీఎస్టిమేషన్ల పేరిట రూ.వెయ్యి కోట్లకు పెంచరాంటే.. ఇది రైతుల కోసం కాదని నాయకుల స్వార్థం కోసమేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కోసం రైతులు గోస పడుతున్నారని అన్నారు. నెల రోజుల్లో ఉప్పగల్లు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నీళ్లు అందించకపోతే రాజయ్యతో కలిసి పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు.