హైదరాబాద్ సిటీబ్యూరో/జవహర్‌నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ప్రేమకు అడ్డొస్తున్నదని కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. తన ప్రియుడితో కలిసి చంపేసిన మైనర్ బాలిక శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పది నెలల క్రితం జరిగిన హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఈ దారుణం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి కనిపించడం లేదని మరో కూతురు ఐదు నెలల క్రితం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మొదట తేలికగా తీసుకున్నారు. ఇంతలో మృతురాలి బైక్‌ను నిందితులు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న విషయమై పోలీసులు కూపీలాగడంతో హత్యోదంతం బయట పడింది. ఈ మేరకు బుధవారం నేరేడ్మెట్లోని మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కౌకురు భరత్‌నగర్‌లో నివాసముండే డీఆర్ అంజు(40), ఈశ్వర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. విభేదాలతో ఐదేండ్ల క్రితం దంపతులు విడిపోయారు. అంజు ఇండ్లల్లో పనులు చేసుకుంటూ కూతుళ్లను పోషిస్తున్నది. జీడిమెట్లలోని సుభాష్‌నగర్‌లో ఉండే బీహార్‌కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్‌సింగ్, అంజు చిన్న కుమార్తె(17)ను ప్రేమించాడు. 2024లో తన కూతురుతో మోంటీకుమార్ ఇంట్లో ఉండగా తల్లి పట్టుకొని జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మోంటీకుమార్ 50 రోజులు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ బాలికతో సంబంధం కొనసాగిస్తున్నాడని మరోసారి బొల్లారం పోలీసులకు అంజు ఫిర్యాదు చేయడంతో జనవరి 2025లో పోక్సో, రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తమ ప్రేమకు తల్లి అడ్డొస్తున్నదని మైనర్ కూతురు, మోంటీకుమార్లు భావించి ఎలాగైనా ఆమెను అంతమొందించాలని ప్లాన్ చేశారు.పథకం ప్రకారం మే 12, 2025న వారి ఇంట్లోకి వచ్చి కాపు కాస్తున్న మోంటీకుమార్.. బయటినుంచి అంజు లోపలికి రాగానే కత్తితో ఆమెను పొడిచాడు. ఆమె అరవకుండా బాలిక పట్టుకున్నది. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్రూమ్లో మంచం కింద దాచి, వాసన రాకుండా స్ప్రే చేశారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే మైనర్ బాలిక సోదరి రోషిణికుమారి ఇంటికి వచ్చేసరికి తల్లి కన్పించలేదు, బెడ్రూమ్లో ఇద్దరే ఉన్నారు. అయితే ఆమెకు వాళ్ల ప్రేమ విషయం తెలియడంతో గదిలో ఉన్న వాళ్లను ఇబ్బంది కల్గించకుండా, మరునాడు ఉదయం ఆమె తన విధులకు వెళ్లిపోయింది. ఇంట్లో శవంతో ఉన్న మోంటీకుమార్, బాలిక గదిలో నాలుగు అడుగుల గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూడ్చేశారు. పైన మొత్తం సిమెంట్‌తో పూడ్చేసి, సాయంత్రం ఇంటికి వచ్చిన అక్కకు ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని ఫ్లోరింగ్ సరిచేశామని నమ్మించారు. వారం రోజుల పాటు అక్కడే ఉండి జీడిమెట్లకు వెళ్లిపోయారు. పెద్ద కూతురు కూడా మరోచోటుకు వెళ్లిపోయింది. అయితే తల్లి ఎక్కడికో పోయిందని, ఎవరితో వెళ్లిందోనంటూ చిన్న కూతురు అపోహలు సృష్టించింది.
అంజు చిట్టీ డబ్బులు కడుతుండేది. ఆ డబ్బులు తీసుకోవడానికి చిన్న కూతురు, తన ప్రియుడితో కలిసి నిర్వాహకుడిని సంప్రదించింది. అయితే డబ్బులు మీ అమ్మకే ఇస్తానని, అవసరమైతే పోలీస్‌స్టేషన్ నుంచి ఏదైనా ఆధారం కావాలని కోరాడు. బాలిక, ఈ విషయాన్ని తన సోదరితో చెప్పింది. ఈ క్రమంలోనే తన తల్లి కన్పించడం లేదంటూ పెద్ద కూతురు రోషిణి జవహర్‌నగర్ పోలీసులకు 2025, అక్టోబర్‌లో ఫిర్యాదు చేసింది. తన తల్లి స్కూటీ వాడుతుందని, ఆ స్కూటీతో పాటు ఆమె కూడా కన్పించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మృతదేహాన్ని పూడ్చేసిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంజు విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఐదు నెలలుగా మిస్సింగ్ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఇంతలో మోంటీకుమార్, బాలిక.. అంజు స్కూటీని విక్రయించేందుకు ప్రయత్నించారు. స్కూటీని కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆ స్కూటీ నెంబర్ కేసులో ఉన్నదనే విషయం తెలిసి పోలీసుల వద్ద ఆరా తీశారు. పోలీసులకు మిస్సింగ్ కేసుపై లోతైన దర్యాప్తు జరుపడం, ఈ క్రమంలోనే బాలిక గర్భవతి కావడంతో మోంటీకుమార్ ఈ ఏడాది జనవరిలో యాదగిరిగుట్టలో పెండ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం రెండు నెలల క్రితం బిడ్డ పుట్టినట్లు తెలుసుకున్నారు. ముందుగా మోంటీకుమార్ను అదుపులోకి తీసుకొని, స్కూటీ విషయంపై ఆరా తీయడంతో హత్య విషయం బయటపడింది. దీంతో మృతదేహాన్ని పూడ్చేసిన స్థలానికి పోలీసులు వెళ్లి పోస్టుమార్టం చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మోంటీకుమార్ను అరెస్ట్ చేసి, బాలికపై జువెనైల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ తెలిపారు. సమావేశంలో జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, ఇన్స్పెక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.