కృష్ణ కాలనీ, ఆగస్టు13 : ఆస్తి కోసం కన్న తండ్రిపైనే దాడి చేసి కాళ్లు విరగ్గొట్టింది ఓ కూతురు. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్స్ కాలనీలో వెలుగుచూసింది. సింగరేణి విశ్రాంత కార్మికుడు వేల్పుల మల్లేశ్.. లక్ష్మారెడ్డిని దత్తత తీసుకొని తన చిన్న కూతురు మహేశ్వరితో వివాహం చేశాడు. దీంతో మల్లేశ్ మొత్తం ఆస్తిని కూతురు, అల్లుడు తీసుకున్నారు. కొన్ని ఫిక్స్డ్ బాండ్లు, 2 గుంటల భూమి మాత్రమే మల్లేశ్ వద్ద ఉండగా.. అవి కూడా తమకే ఇవ్వాలని, లేదంటే చంపుతామని కొంతకాలంగా బెదిరిస్తున్నారు.
సోమవారం సా యంత్రం కూతురు, అల్లుడితోపాటు మరో నలుగురు వచ్చి మల్లేశ్‌ను కదలకుండా పట్టుకొని రెండు కాళ్లు విరిగేలా తీవ్రంగా కొట్టారు. లేవలేని స్థితిలో ఉండటంతో జిల్లా కేంద్రంలోని 100 పడకల దవాఖానకు తీసుకెళ్లారు. అకడ తమ నాన్న మెట్ల మీదికి వెళ్లి అడ్డం పడ్డాడని కూతురు చెప్పగా.. పరీక్షించిన వైద్యులు మల్లేశ్‌కు రెండు కాళ్లు విరిగాయని, ఎవరో తీవ్రంగా కొట్టడంతోనే ఇలా జరిగిందని చెప్పడంతో అకడి నుంచి జారుకుంది. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో మల్లేశ్ ఫిర్యాదు చేయడంతో కూతురు మహేశ్వరి, అల్లుడు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.