హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ అంటేనే కక్ష సాధింపు, కమీషన్లు, కాలయాపన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నల్లజెండాలతో బాలసముద్రంలోని భారత రాష్ర్ట సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, పబ్లిక్‌గార్డెన్, అశోకా జంక్షన్, హనుమకొండ రస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం
హనుమకొండ రస్తా ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, బీడువారిన భూములకు నీళ్లిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు అని గుర్తుచేశారు. కాళేశ్వర ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్లకు ఎత్తిపోయడం, 240 టీఎంసీల నీటి ఉపయోగం.
ఇంతపెద్ద కాళేశ్వర ప్రాజెక్టులో కేవలం ఒక బ్యారేజీలోని 100 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగాయని రాద్ధాంతం చేయడం సరైంది కాదన్నారు. కమీషన్ల పేరుతో కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయని మండిపడ్డారు. కమీషన్ల పేరుతో ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలు మరిచిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పూటకో మాట చెబుతూ.. బీసీల కు అన్యాయం చేసిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు.
అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు వినయ్‌భాస్కర్ ప్రయత్నించగా, స్థానిక సీఐ మచ్చ శివకుమార్-వినయ్భాస్కర్ని చేయ్యిపట్టుకుని నెట్టివేసే వేసేందుకు ప్రయత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల నడుమ రెండు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు సంకు నర్సింగ్‌రావు, సోదా కిరణ్, చెన్నం మధు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, వెంకన్న, రమేష్, చందర్, శ్రీనివాస్, సునీల్, శ్రీధర్, సదాంత్, జావీద్, రవియాదవ్, శరత్, రాకేష్‌యాదవ్, స్నేహిత్, వినీల్‌రావు, రవీందర్, మహమూద్, మూటిక రాజు, సోని, విక్టరీబాబు, నాగరాజు, అఫ్జల్, సాయి, రాజ్‌కుమార్, సందీప్‌యాదవ్, విజయ్‌రెడ్డి, గండు అశోక్‌యాదవ్, మహేష్ పాల్గొన్నారు.