హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్ అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. నాయినికి కేటీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని, కేటీఆర్‌ను విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడమేనని అన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి మెప్పుకోసం మాజీ మంత్రి కేటీఆర్‌పై అనుచితంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. నాయిని ప్రజానాయకుడు కాదని, రాజకీయ బ్రోకర్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సూట్‌కేసుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం ఆయనకు అలావాటేనని అన్నారు.
ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు కేటీఆర్‌ను విమర్శించే ముందు మీ నాయకుడు రాహుల్‌గాంధీ ఎకడి నుంచి వచ్చాడో చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలితే ప్రజలు మీ నాలుకలను తెగ్గోస్తారు జాగ్రత్త అంటూ వాసుదేవరెడ్డి హెచ్చరించారు.