వరంగల్, మే 18 : బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఖబడ్దార్ అని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రామన్నపేటలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి మహిళలు, యువకులు బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వినయ్‌భాస్కర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వెంటాడుతామని హెచ్చరించారు. స్వరాష్ట్రాన్ని సాధించిన వాళ్లం కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టీయేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని కోరారు.