రైతుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని నమ్మించి.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో వ్వయసాయం పండగలా ఉండేదని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వేళల్లో రైతులకు అండగా ఉండేదని తెలిపారు.
కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి వ్యవయానికి 24 గంటల కరెంట్ ఇచ్చామని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలుచేయలేదని విమర్శించారు. అంగన్వాడీలు రోజూ రోడ్డెక్కి పోరాడుతున్నారని తెలిపారు. ఆశావర్కర్లది కూడా అదే పరిస్థితి అని అన్నారు. అంగన్వాడీల సమస్యలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు. రూ.4వేలు ఉన్న జీతాన్ని రూ.7వేలకు పెంచారని గుర్తుచేశారు. మళ్లీ జీతం సరిపోవడం లేదంటే రూ.10,500కు పెంచారని అన్నారు.
ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానిది, తెలంగాణ ఉద్యోగులది పేగుబంధంలా ఉండేదని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచామని తెలిపారు. నిరసనలు తెలపక ముందే వారి సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు.