వరంగల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు కనీస అవగాహన లేదని, సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం రూ.6,500 కోట్లతో దేవాదుల ప్రాజెక్టును అభివృద్ధి చేసిందని, సమ్మక్క బరాజ్ నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టు నుంచి ఏడాది మొత్తం నీటిని ఎత్తిపోసే వసతి కలిగిందని చెప్పారు.
రుణమాఫీ, రైతు భరోసాను పక్కన బెట్టడానికి ఇన్నాళ్లు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అని కథలు చెప్పిందని, ఇప్పుడు హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నదని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునే నరేందర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
దేవాదుల ప్రాజెక్టు మీద కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేక కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నఅన్యాయాన్ని కేసీఆర్ ప్రశ్నించినందుకే దేవాదుల ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయని గుర్తుచేశారు.
కేసీఆర్ ఉద్యమంతో టీడీ పీ ప్రభుత్వం దేవాదులకు పునాది వేసినప్పుడు కడియం శ్రీహరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గా ఉన్నారని, బీఆర్ఎస్ హయాంలో రూ.6500 కోట్లతో ప్రాజెక్టును అభివృద్ధి చేసినప్పుడు కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారని, ‘కేసీఆర్ అపర భగీరథుడని, ఆయన వల్లే దేవాదుల ప్రాజెక్టు పూర్తయి ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతున్నదని’ కడియం శ్రీహరి ప్రశంసించారని గుర్తుచేశారు.
ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కన కూర్చొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తోచినట్టుగా మాట్లాడుతున్నారని, పదవుల కోసం పార్టీలు మారుడు కడియం శ్రీహరి ఇష్టంగానీ.. రాజకీయాల కోసం మాట మార్చడం సరికాదని హితవు చెప్పారు.
కాంగ్రెస్ కరువు తెచ్చింది : రాజయ్య
కేసీఆర్ హయాంలో మండుటెండలో సైతం చెరువులు నిండుకుండలా ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక సాగునీటి నిర్వహణలో విఫలమై కరువు తెచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలకు కడి యం శ్రీహరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గు, శరం ఉంటే బీఆర్ఎస్తో వచ్చిన ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అతిపెద్ద డెకాయిట్ అని మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డి విమర్శించారు. నిరుడు ఇప్పటికే దేవాదుల నుంచి 16.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశారని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ మొదలు పెట్టలేదని దుయ్యబట్టారు. ప్రజాపాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను మభ్యపెట్టే పాలన తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. ఆర్మీలో ఉన్నప్పుడు డెకాయిట్ పనులు చేయడం వల్లే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వెళ్లగొట్టారని ఆరోపించారు.