హైదరాబాద్ జూన్1 (నమస్తేతెలంగాణ) : ‘కేసీఆర్ నాడు సీమాంధ్ర పాలకుల దోపిడీని ఎదిరించి.. పదవులను గడ్డిపోచలా త్యజించి.. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో ముందు నిలిపిన తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి నేడు వింధ్వంసం సృష్టిస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హ యాంలో విధ్వంసం, విద్వేషాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సంపద సృష్టిలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణను నేడు అధోగతి పాలుచేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఉపేంద్ర, సుమిత్రా ఆనంద్ తానోబాతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం ఉమ్మడి పాలకుల దోపిడీ విధానాలకు వత్తాసు పలికారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరి త్ర ఉన్నదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తన గురువైన చంద్రబాబు కనుసన్న ల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు. ఉమ్మడి పాలనలో ఆంధ్రా పాలకులు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అహింసా మార్గంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని పునరుద్ఘాటించారు. తెచ్చిన తెలంగాణను పదేండ్లు సుసంపన్నం చేశారని తెలిపారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. నేడు రేవంత్ సర్కార్ అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నదని మండిపడ్డారు.
అందగత్తెలను చూసేందుకు ఐదుసార్లు ఈవెంట్లకు వెళ్లిన సీఎంకు, కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించే తీరికే లేదా అని దాసోజు ప్రశ్నించారు. కల్లాల్లో వడ్లు తడిసి బోరుమంటున్న రైతుల గోసను తీర్చే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.