Dasoju Sravan | హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని ఎన్నికల అధికారి తిరస్కరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దాసోజు శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా పనిచేశారు. అనేక వేదికల మీద తెలంగాణ భావజాలవ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు.
ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో ఎంపిక చేసింది. నాటి గవర్నర్ తమిళి సై వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన, బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపినా నాటి గవర్నర్ తొక్కిపెట్టారు. రాష్ట్ర గవర్నర్‌గా ఉంటూ బీజేపీ ఎంజెడాను అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా దాసోజు శ్రవణ్ వంటి బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలనే సంకల్పం నుంచి దూరం కాలేదని తాజా నిర్ణయం చాటిచెప్పటం విశేషం.
పుట్టిన తేదీ: 1966 జూన్ 7
కులం: విశ్వకర్మ (బీసీ)
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టెక్‌మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హో దాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు.