మారేడ్‌పల్లి, చిన్నగూడూరు సెప్టెంబర్ 23: ప్రముఖ రచయిత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య సతీమణి దాశరథి కమల (92) మంగళవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో తుదిశాస్వ విడిచారు. 2015 జూన్‌లో దాశరథి రంగాచార్య మృతి చెందిన విషయం విదితమే. కాగా, కమల మృతి చెందిన విషయం తెలుసుకున్న వారి బంధువులు, అభిమానులు, స్థానికులు పెద్దఎత్తున మారేడ్‌పల్లిలోని ఆమె నివాసానికి చేరుకుని పూలమాల వేసి నివాలర్పించారు. దాశరథి రంగాచార్య, కమల దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం మారేడ్‌పల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. కమల మృతితో మహబూబాబాద్ జిల్లాలోని ఆమె స్వగ్రామమైన చిన్నగూడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
కమల మృతిపై పలువురు సంతాపం
నిజాం నిరంకుశ ప్రభుత్వంపై అవిశ్రాంత పోరాటం చేసి.. తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన దాశరథి రంగాచార్యుల సతీమణి కమల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తంచేశారు. ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.