వనపర్తి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా రచనలు చేసిన గొప్ప వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన నైజాంలాంటి వ్యక్తిని ఎదురించిన అత్యంత ధైర్యశాలి అని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో సాహితీ కళావేదిక, తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశపతి మాట్లాడుతూ.. జైల్లో ఉంటూ కూడా దాశరథి గర్జనలు ఆగలేదని అన్నారు. మలిదశ ఉద్యమంలో దాశరథి గోడలపై ప్రత్యక్షమయ్యారని, తెలంగాణలో బీఆర్ఎస్ పుట్టినప్పుడు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ గోడల మీద రాసి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన ధీశాలి అని గుర్తుచేశారు. తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తూ.. తెలంగాణ అస్తిత్వాన్ని దాశరథి కవిత్వం పురివిప్పి నాట్యం చేసిందని తెలిపారు.
అసెంబ్లీ, పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించేందుకు నాడు కేసీఆర్ ప్రత్యేక రాజకీయ వేదిక టీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తే.. అవహేళన చేశారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలంగాణ బిల్లు పెట్టించే వరకు పోరాటం చేసే పరిస్థితి లేనప్పుడు పార్టీని ఆవిర్భవించేలా కేసీఆర్ చేశారన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణకు రాజకీయ స్వరం లేదని చెప్పారు. చారిత్రక అవసరాన్ని గుర్తించి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని దేశపతి పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు దాశరథి పేరు చిరస్థాయిగా ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ రచనలు చేశారని గుర్తుచేశారు. ఆంధ్రా మహాసభలో, కమ్యూనిస్ట్ బాడీలో పనిచేశారని తెలిపారు. దాశరథికి నిజమైన నివాళులు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అర్పించిందని అన్నారు.
తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటారు : ఆర్ఎస్పీ
‘దాశరథి గురించి మా తెలుగు టీచర్ ఒక్క రోజు కూడా చెప్పలేదు. తెలంగాణలో పుట్టి.. తెలంగాణగడ్డ వైభవాన్ని ప్రపంచానికి చాటిన దాశరథి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాటి చదువుల ద్వారా తెలంగాణ కవుల గురించి తెలుసుకునే పరిస్థితులు లేవన్నారు. దాశరథి అద్భుతమైన రచనలు చేశారని, సిని మా పాటలు వింటుంటే ఇవి దాశరథి రాసినవేనా? అన్నంత ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పా రు. కార్యక్రమంలో కవులు కోటేశ్వరావు, శరత్చంద్ర, బాలరాం, సుబ్బయ్య, శంకర్‌గౌడ్, గట్టు యాదవ్, శ్రీధర్ పాల్గొన్నారు.