హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): దసరా పండుగకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. బీర్ల అమ్మకాలు మునుపెన్నడూలేనంత బంపర్ రేంజ్లో అమ్ముడయ్యాయి. దసరా దెబ్బకు ప్రభుత్వ ఖజానాలో కేవలం 11 రోజుల్లోనే రూ.1285.16 కోట్లు వచ్చిపడ్డాయి. ఆ స్థాయిలో మద్యం అమ్మకాలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పండుగ రోజు ఎక్కడా నోస్టాక్ బోర్డులు కనిపించకుండా.. డిపోలకు ముందుగానే మద్యాన్ని చేరవేసేలా ప్రభుత్వ పెద్దలు పథకం రచించారు.
డిపోల నుంచి మద్యం తీసుకెళ్లే విధంగా మద్యం దుకాణాల యజమానులకు టార్గెట్లు కూడా విధించారు. ‘డబ్బులు.. మందు అమ్మిన తర్వాత చెల్లించొచ్చు.. ముందు వచ్చిన స్టాక్‌ను తీసుకెళ్లండి’ అంటూ ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ డిపోల్లోని మద్యం స్టాక్‌ను ఖాళీ చేయించినట్టు తెలిసింది. ఆ పథకం ప్రకారం మొత్తం రూ.1500 కోట్లు వస్తాయని భావించగా.. దసరా పండగ శనివారం రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆదివారం సెలవు రోజు కావడంతో మొత్తానికి లక్ష్యానికి చేరువగా రావడం, గత దసరా కంటే 13శాతం ఎక్కువగా లాభాలు రావడంతో ఒకింత ఊరటనిచ్చిందని తెలిసింది.
జోరుగా లిక్కర్, బీర్ల అమ్మకాలు..
అక్టోబర్ 1 నుంచి 14 వరకూ 3 రోజులు సెలవులు పోనూ.. 11 రోజుల్లో ఎక్సైజ్‌శాఖకు రూ.1285.16 కోట్లు వచ్చాయి. వీటిల్లో ఈ సారి 11,03,614 కేసుల లిక్కర్ సీసాలు.. 20,63,350 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పండగకి ముందురోజు అంటే 11వ తేదీన అత్యధికంగా రాష్ట్రవ్యాప్తంగా 3,06,761 కేసుల బీర్లను కొనుగోలు చేశారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభు త్వ పెద్దలు ఈసారి భారీస్థాయిలో బెల్ట్‌షాపులకు మద్యం విక్రయించారు. ఏ గల్లీలోని కిరాణా కొట్టు లో చూసినా లిక్కర్ బాటిళ్లు, బీరు సీసాలే దర్శనమిచ్చాయనేది బహిరంగ రహస్యం. విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగినా ఒక్క ఎక్సై జ్ అధికారి కూడా వాటిని నిలువరించలేకపోయారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే అధికారులు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తి చూడలేదని విశ్వసనీయ సమాచారం.
బెల్ట్‌షాపుల తాట తీస్తానన్న సీఎం ఎక్కడ?
గత ప్రభుత్వం ఓ క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టినా.. ‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేశారు’ అని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎన్నోవేదికలపై చెప్పారు. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నా ప్రజాపాలన పేరుతో ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు ఎక్సైజ్శాఖపైనే ఆధారపడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎక్కువ మద్యం అమ్మకాలు జరుపాలని అధికారులకు అనధికార ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. లిక్కర్, బీర్, వ్యాట్స్, ఇతర లైసెన్స్‌ల ఫీజుల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతినెలా రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది.
ప్రభుత్వానికి కొన్ని పథకాల అమలుకు తక్షణం నిధులు అవసరం కావడంతో తమ లక్ష్యాన్ని రూ.45వేల కోట్లకు పెంచినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో ఉన్న 60వేలకు పైగా ఉన్న బెల్ట్‌షాపుల తాట తీస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు ఎత్తివేస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మద్యనిషేధంలేకున్నా.. మద్యం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.