Yadagiri Gutta | యాదగిరిగుట్ట, మార్చి 17: యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలిసిన నృసింహస్వామితో.. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ముక్కోటి దేవతల సాక్షిగా బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి నయనానందకరంగా సాగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాడవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. అలంకార నరసింహుడిని అశ్వవాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారిని తూర్పునకు అభిముఖంగా, అమ్మవారిని పశ్చిమ దిశకు అభిముఖంతో ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్వికులు ఆసీనులై పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అలంకార సేవోత్సవంలో భాగంగా స్వామివారు ఉదయం 9 గంటలకు జగన్మోహిని రూపంలో తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం, పర్యవేక్షకులు సురేశ్, అర్చకులు, అధికారులతో కలిసి యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావుకు సంప్రదాయబద్ధంగా మేల్చాట్ పట్టు వస్ర్తాలను అందజేశారు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన లక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి 8:45 గంటలకు అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ వేదిక ముందు భాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియా, దాతలు, దేవస్థాన అధికారులు, కల్యాణంలో పాల్గొనే భక్తులకు వేర్వేరుగా ప్రత్యేకమైన లాబీలను ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని 10 వేల మంది వీక్షించే విధంగా ఆలయ అధికారులు కొండపైన 8 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.