గ్రీన్ ఇండస్ట్రిల్ పార్కు పైలాన్
సూర్యాపేట/హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు అందరి దృష్టీ మునుగోడుపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ గానీ, గత ఎనిమిదేండ్ల నుంచి కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ కానీ ఎన్నడూ మునుగోడును పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చేసరికి మునుగోడును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ కారుకూతలు కూస్త్తున్నాయి. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలోని దండుమల్కాపూర్‌లో ఇప్పటికే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైంది. 542 ఎకరాల్లో సకల సౌకర్యాలతో కొలువుదీరిన ఈ పార్కులో ఇప్పటికే దాదాపు 50 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించి సుమారు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ కంపెనీల ఉత్పత్తులు పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ పార్కును 1,863 ఎకరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ విస్తరణలో భాగంగా మరో 231 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనితోపాటు మరో 106 ఎకరాల్లో బొమ్మల తయారీ పరిశ్రమల పార్కును నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చైనానుంచి ప్రస్తుతం దిగుమతి చేసుకొంటున్న బొమ్మలు ఈ పార్కులోనే తయారవుతాయి. ఈ భారీ పార్కులో పరిశ్రమలన్నీ అందుబాటులోకి వస్తే మొత్తంగా 1.32 లక్షల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
స్వరాష్ట్రం ఏర్పాటుతో..
ఒకప్పుడు కంపెనీల్లో ఉద్యోగాలంటే హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి పారిశ్రామిక వాడలు మాత్రమే గుర్తొచ్చేవి. వాటితోపాటు నాచారం, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా పనులు దొరికేవి. జిల్లాల నుంచి యువత, కార్మికులు పొట్ట చేతపట్టుకొని పనుల కోసం ఈ ప్రాంతాలకే వచ్చేవారు. కానీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. వీటిలో దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి. దీనిలో ఇప్పటికే దాదాపు 50 కంపెనీల కార్యకలాపాలు మొదలయ్యాయి. వాటి ఉత్పత్తులను అమెరికా, ఆఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, గల్ఫ్, న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే హైదరాబాద్‌లోని బాలానగర్, జీడిమెట్ల తరహాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారికీ ఉద్యోగాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన ఉత్పత్తులు
దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రస్తుతం గనులు తవ్వే యంత్రాలు, వాటి పరికరాలు, బ్రిక్స్, టైల్స్ వంటి నిర్మాణ సామగ్రి, డ్రిల్లింగ్కు సంబంధించిన పరికరాలు, ప్యాకేజింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలు, యంత్రాలు, మౌల్డింగ్ ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమలు, సోలార్, బయో ఫెర్టిలైజర్స్, నిర్మాణ సామగ్రి, ప్రింటింగ్, యంత్రాల తయారీ వంటివి రూపొందుతున్నాయి. త్వరలో ఇక్కడ వివిధ రకాల భారీ యంత్రాలకు సంబంధించిన అనుబంధ పనిముట్ల తయారీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో సోడా హబ్ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభమైన దృశ్యం
భారీగా పెరిగిన భూముల ధరలు
దండుమల్కాపూర్ పారిశ్రామికవాడ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఎకరం భూమి ఇప్పుడు రూ.కోటిన్నర వరకూ పలుకుతున్నది. దీంతో చిన్న, సన్నకారు రైతులు సైతం సంతోషంగా ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పిల్లలను హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ స్కూళ్లకు పంపుతున్నారు. గతంలో ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందిపడ్డ స్థానిక మహిళలు కూడా ఇప్పుడు కంపెనీల్లో రకరకాల ఉద్యోగాలు చేసుకొంటూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారు.
గణనీయంగా ఉద్యోగావకాశాలు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో రక్షణరంగ పరిశ్రమ
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో లియో టైల్స్ పరిశ్రమలో ప్రారంభమైన ఉత్పత్తులు
దండుమల్కాపూర్తోపాటు తూప్రాన్‌పేట, బాటసింగారం, దండుమైలారం, కొయ్యలగూడెం, చౌటుప్పల్, పీపలపాడు, సంస్థాన్ నారాయణపురం, లకారం తదితర గ్రామాల ప్రజలకు ఇక్కడ విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరితోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 35 వేలమందికి ఉపాధి లభిస్తుంది.
తగ్గుతున్న వలసలు
గతంలో దండుమల్కాపూర్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చేవారు. ప్రస్తుతం దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో హైదరాబాద్‌కు వలసలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటికే దండుమల్కాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోజూ దాదాపు 3 వేల మంది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. పరిశ్రమలన్నీ పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయే అవకాశం ఉన్నది.
194 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్
దేశంలోనే తొలిసారి ‘వాక్ టు వర్క్’ విధానాన్ని అమలుచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు 194 ఎకరాల్లో సమీకృత నివాస సముదాయం (ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్)తోపాటు వారికి అవసరమైన స్కూళ్లు, మార్కెట్, రిక్రియేషనల్ ఏరియా, బ్యాంకులు, ఫైర్ స్టేషన్, దుకాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ఓ కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. కంపెనీల నిర్వాహకులు, కార్మికులు ఈ టౌన్‌షిప్‌లోనే ఉండటం వల్ల పని ప్రదేశం దగ్గర కావటంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
సువిశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఇప్పటికే రూ.236 కోట్లతో విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.236 కోట్లు ఖర్చు చేసింది. 2.20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అత్యాధునిక నైపుణ్య శిక్షణ, కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇక్కడ అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం పూర్తికానున్నదని, ఇక్కడ శిక్షణ పొందే అభ్యర్థులను కంపెనీలు ముందుగానే రిజర్వు చేసుకొంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
90% ఉత్పత్తులు విదేశాలకే..
ఆఫ్రికాలోని సుడాన్, నైజీరియాతోపాటు పలు ఇతర దేశాలకు మా కంపెనీ నుంచి సోడా మెషీన్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్డర్లు బాగా వస్తుండటంతో మొత్తం ఉత్పత్తుల్లో 90% విదేశాలకే పంపుతున్నాం. ఇక్కడి నుంచి కంటెయినర్లలో ముంబైకి తరలించి నౌకల ద్వారా ఆయా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఉప్పల్‌లో మాకు మరో యూనిట్ కూడా ఉన్నది. అక్కడి నుంచి మన దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం.
– శరత్ చంద్ర, సోడా హబ్ కంపెనీ నిర్వాహకుడు
మహిళా కార్మికులే ఎక్కువ
ప్యాకేజింగ్ యూనిట్లో ఏడాది నుంచి పనిచేస్తున్నా. మా కంపెనీలో 30 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు రూ.10-15 వేల వరకు వేతనాలు పొందుతున్నారు. టెక్నీషియన్లకు రూ.30 వేల వరకూ ఇస్తున్నాం. అంతా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలవారే ఉన్నారు. ఒకరిద్దరు ఇతర రాష్ర్టాలకు చెందినవారు పనిచేస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలో ఎటువంటి కాలుష్యానికి తావులేకుండా కంపెనీలు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సజావుగా సాగుతున్నాయి. కష్టంతో కూడిన పనులు కాకపోవడంతో ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నారు.
– బాలాజీ, ఉప్పల్, ప్యాకేజింగ్ కంపెనీ సూపర్వైజర్
ఉద్యోగ భద్రత ఏర్పడింది..
ఇంటర్ వరకు చదివి, 8 నెలల నుంచి ఇక్కడ సోడా మెషీన్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్నా. నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. ఇక్కడ కంపెనీల ఏర్పాటు వల్ల ఉద్యోగ భద్రత ఏర్పడింది. ఊరికి సమీపంలోనే ఏదో ఒక కంపెనీలో పని దొరుకుతుందనే ధైర్యం వచ్చింది. టెన్త్, ఇంటర్ వరకు చదువుకున్న నాలాంటి యువకులు చాలామంది ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా ఎక్కువ మంది పనుల కోసం హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఇక్కడ కంపెనీలన్నీ సిద్ధమైతే ఎవ్వరూ హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
– చంద్ర, మైలారం
10 వేల వేతనం.. కంపెనీలోనే భోజనం
మాది దండుమల్కాపూర్. ఏడాది నుంచి ఇక్కడే ప్యాకింగ్ యూనిట్లో పనిచేస్తున్నా. నెలకు రూ.10 వేల జీతం ఇచ్చి కంపెనీలోనే భోజనం పెడు తున్నారు. మా ఊరు నుంచి అనేక మంది ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తు న్నారు. ఉదయాన్నే వచ్చి సాయంత్రానికి ఇళ్లకు వెళ్లిపోతాం. ఇక్కడ కంపెనీ లు నెలకొల్పుతారని మేమెప్పుడూ ఊహించలేదు. గతంలో వ్యవసాయ సీజన్లోనే పనులు దొరికేవి. మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండడమో, లేక పనులకోసం హైదరాబాద్ వెళ్లడమో చేసేవాళ్లం. ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతో ఊళ్లోనే ఉంటూ గౌరప్రదంగా ఉద్యోగాలు చేసుకునే వీలు కలిగింది. ఇదంతా తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమైందని భావిస్తున్నాం.
– రజిత, మల్కాపూర్
పనులకు కొదవలేదు
గతంలో మా ఊర్లోనే వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లం. ఓ రోజు పని దొరికితే మరో రోజు దొరికేది కాదు. ఇక్కడ కంపెనీలు పెట్టినప్పటినుంచి మాకు పనులకు కొదవలేదు. గత 9 నెలల నుంచి ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేస్తున్నా. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కంపెనీలోనే పెడతారు. సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోతాం. ఇక్కడికి కొత్తగా చాలా కంపెనీలు వస్తుండటంతో పనులు దొరకవన్న భయం పటాపంచలైంది. – ఉమ, మల్కాపూర్
చేతినిండా పని
గతంలో మా ఊర్లో గానీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో కూలి పని దొరికేది కాదు. ఇప్పుడు మా ఊరి పక్కనే కొత్త కంపనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నెలకొల్పిన లియో టైల్స్ కంపెనీలో రెండేండ్ల నుంచి చేతినిండా పని దొరుగుతున్నది. ఇక్కడ సుమారు 600 మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.15 వేల జీతం వస్తున్నది. ఇప్పుడు కుటుంబ పోషణకు ఎలాంటి రందీ లేదు. సీఎం కేసీఆర్ సారు చాలా ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తుండు. – జె. మహాంకాళి, దండు మల్కాపురం గ్రామం
ఉపాధి కోసం పట్నం దాకా వెళ్లేవాళ్లం
గతంలో పని కోసం చాలా కాలంపాటు హైదరాబాద్‌కు వెళ్లేవాడిని. అక్కడకి కంపెనీల చుట్టూ తిరిగితే గానీ సరైన పని, మంచి వేతనం దొరికేది కాదు. ఇప్పుడు మా ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడంతో పలు కంపెనీలు వస్తున్నాయి. వాటిలో మాతోపాటు ఇతర ప్రాంతాలవారికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మా భూముల ధరలు కూడా భారీగా పెరగడంతో గోస తీరింది.
– డీ బాబురావు, దండుమల్కాపురం గ్రామం
ఉద్యోగంతో కుటుంబానికి ఆసరా
గతంలో మా ఊర్లో పని లేక ఖాళీగా ఉండేవాళ్లం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడంతో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. వాటిలో ఒకటైన తేజస్ ఫుడ్స్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. రోజుకు రూ.300 సంపాదిస్తూ కుటుంబానికి కొంత ఆసరాగా నిలుస్తున్నా. బస్సు సౌకర్యం కల్పించడంతో పక్క ఊర్ల నుంచి చాలా మంది మహిళలు వచ్చి ఉద్యోగం చేసుకొంటున్నారు. కంపెనీల ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– కే అరుణ, తంగడుపల్లి గ్రామం