హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అట్లనే రాష్ట్ర ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాంట్రాక్టర్ల బిల్లులే కాదు.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హక్తుభుక్తంగా రావాల్సిన మొత్తాల నిధులు విడుదల చేసేందుకూ ఆర్థికశాఖలో దందా కొనసాగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెయ్యి తడిపితే తప్ప నిధులు విడుదల కావటం లేదంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తం సర్కారు వద్దే ఉంటుంది. ఇందులో పదవీవిరమణ పొందినవారు, సర్వీసులో ఉండి చనిపోయినవారితో పాటు 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. వైద్య సదుపాయాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, పిల్లల చదువులు వంటి అత్యవసర అవసరాల కోసం జీపీఎఫ్ మొత్తంలోని 50 శాతాన్ని ఫైనల్ బిల్లుగా పొందేందుకు ఈ దరఖాస్తు చేసుకుంటారు.
సంబంధిత డీడీవో (డిస్బర్సింగ్ డ్రాయింగ్ ఆఫీసర్) నుంచి ఉద్యోగుల వివరాలు జిల్లా పరిషత్తుకు వెళ్తాయి. అక్కడ ఒక్కొక్కరివి కాకుండా కొంతమంది ఉద్యోగుల జాబితాను రూపొందించి.. అందరికి సంబంధించిన మొత్తంతో చెక్‌ను రూపొందించి, ఆర్థికశాఖకు పంపుతారు. జిల్లాల నుంచి వచ్చిన చెక్కులను ప్రాధాన్య క్రమంలో తీసుకొని ఆర్థికశాఖ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రాధాన్య క్రమం క్రమం తప్పిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుల చెక్కులే నిదర్శనం. గత ఏడాది డిసెంబర్లో జడ్పీ నుంచి వచ్చిన చెక్‌ను కాదని, కొన్నిరోజుల కిందట వచ్చిన చెక్‌ను క్లియర్ చేయటం వెనుక మతలబు ఏమిటనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. పైగా తక్కువ మొత్తం ఉన్నందున త్వరగా క్లియర్ చేశామని సాకు చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గత డిసెంబర్లో పంపిన చెక్కు మొత్తం రూ.1.58 కోట్లు అయితే, ఇటీవల పంపిన చెక్ విలువ రూ.2.95 కోట్లు. అంటే.. దాదాపు రెట్టింపు. మరి.. తక్కువ మొత్తాన్ని కాదని, ప్రాధాన్య క్రమాన్ని విస్మరించి నిధులు విడుదల చేయటం వెనక జరుగుతున్న దందా ఏమిటి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లు చెక్కును జడ్పీ నుంచి ఆర్థికశాఖకు పంపారు. రూ.1.58 కోట్ల మొత్తంతో గత ఏడాది డిసెంబర్లో ఈ చెక్కును పంపగా ఇప్పటివరకు ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కాలేదు.
ఇదే జిల్లాకు చెందిన మరికొంతమంది ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లుకు సంబంధించిన మరో చెక్కును కూడా ఇటీవలే జడ్పీ నుంచి ఆర్థికశాఖకు చేరింది. ఈ చెక్కు విలువ రూ.2.95 కోట్లు. రోజుల వ్యవధిలోనే దీనికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది. గత జనవరిలో పంపిన మరో చెక్కుకు కూడా రెండు రోజుల కిందట ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది.