హైదరాబాద్, సెప్టెంబర్ 16 ( నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మరో కాంగ్రెస్ నేత తెర మీదికి వచ్చారు. బీఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్మేగా గెలిచి పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసిన తనపై అనర్హత కత్తి వేలాడుతున్నదని, బైపోల్ వస్తే ఖైరాతాబాద్ నుంచి తనకు ఇబ్బందులు తప్పక పోవచ్చనే ఆందోళనతో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. వేటు పడేంత వరకు వేచి చూడటం కంటే తానే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ తనకే ఇవ్వాలని దానం కాంగ్రెస్ అగ్రనేతలను కోరినట్టు సమాచారం.
ఈ మేరకు ఆయన మంగళవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు వెళ్లి మల్లికార్జున ఖర్గేను, ఆయన కుమారుడిని రహస్యంగా కలిసినట్టు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆయనకు ఈ ఏర్పాటుచేసినట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని, ఉప ఎన్నికలకు పోతే మళ్లీ గెలవడం ఆషామాషీ కాదని దానం వివరించినట్టు తెలిసింది. పైగా జూబ్లీ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి ఇంకా దొరకలేదని, అకడ తనను నిలబెడితే గెలుస్తానని, పార్టీ టికెట్ హామీ ఇస్తే తాను రాజీనామా చేస్తానని వారి ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద తనకు పట్టు ఉన్నదని వివరించినట్టు సమాచారం. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు పార్టీ ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.