గ్రామాల్లో వేసిన ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీనియర్లను విస్మరించి, కొత్త వారికే చోటు కల్పించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు జనగామ జిల్లా జఫర్గడ్లోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం వినతిపత్రం ఇచ్చి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ జడ్పీటీసీ పట్టపూరి సదయ్యగౌడ్ మాట్లాడుతూ ఏం డ్ల తరబడి జెండాలు మోసిన పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, నిన్నామొన్న కాంగ్రెస్‌లో చేరిన వారికి నామినేటెడ్ పోస్టులు, ఇందిరమ్మ కమిటీల్లో అవకాశం ఇచ్చి అసలైన కాంగ్రెస్‌వాదులను పక్కన పెడుతున్నాడని ఆరోపించారు.
– జఫర్‌గఢ్
హైదరాబాద్, అక్టోబర్17(నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు ‘హస’్తవ్యస్థంగా మారుతున్నది. వివిధ జిల్లా ల్లో వర్గపోరు వీధినపడుతున్నది. ఇందిరమ్మ కమిటీల నేపథ్యంలో వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. మిగిలిన జిల్లాల్లోనూ కీలక నేత ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది. ఒకరిపై ఒక రు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా లో ఎవరి కుంపటి వారిదే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అదుపు తప్పి పోతున్న నేతలను, కార్యకర్తలను ఎలా గాడిలో పెట్టాలో అర్థంకాక పార్టీ పెద్దలు తలలుపట్టుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. వనపర్తి టికెట్ కేటాయింపు సమయంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. మొదట చిన్నారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి, చివరి నిమిషంలో మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయినా చిన్నారెడ్డి ప్రయత్న లోపం లేకుండా మేఘారెడ్డి గెలుపు కోసం పని చేశారు.
పార్టీ అధికారంలోకి రాగానే చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమించింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య వర్గపోరు తీవ్రమైంది. వేర్వేరు సమీక్షలు నిర్వహించడం, పార్టీలో నూతనంగా చేర్చుకోవడం లాంటి పరిణామాలు ఇద్దరి మధ్య అగ్గి రాజేశాయి. తనకు తెలియకుండానే మేఘారెడ్డి పా ర్టీలోకి కొత్తవారిని తీసుకుంటున్నారని చిన్నారెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు.
పదేండ్లపాటు తమపై కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలోకి చేర్చుకోవద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డికి చిన్నారెడ్డి సూచించారు. అయినా చేరికలు ఆపకపోవడంతో చిన్నారెడ్డి వర్గానికి చెందిన గోపాల్పేట కాంగ్రె స్ పార్టీ మండల అధ్యక్షుడు గణేశ్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. మిగిలిన వారు అడ్డుకుంటున్న క్రమంలో మేఘారెడ్డిపై కూడా పెట్రోల్ పడింది. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు, గన్మెన్లు గణేశ్గౌడ్పై దాడి చేశారు. అప్పటినుంచి ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా రాజకీయం చేస్తున్నారు.
గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సరితా యాదవ్‌కు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ఏమాత్రం పడటం లేదు. తనను ఓడించిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరితాయాదవ్ గట్టిగానే నిలదీశారు. ఆమెను బుజ్జగించిన రాష్ట్ర పార్టీ, త్వరలోనే కార్పోరేషన్ పదవి ఇస్తాననే హామీ ఇచ్చింది. నేటికీ ఆమెకు ఏ పదవి ఇవ్వలేదు. తనకు పదవి రాకుండా కృష్ణమోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడని సరితాయాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఆమె వర్గీయులు తీవ్రంగా విభేదిస్తూ ఆందోళనకు దిగుతున్నారు.
వరుస వివాదాలతో వరంగల్ జిల్లా పతాక స్థాయిలో ఉన్నది. వరంగల్‌లో నడిచేది కొండా ప్రభుత్వమే అని బహిరంగ ప్రకటన చేసిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి.. జిల్లా పై ఆధిపత్యం కోసం అన్నంత పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తమకంటూ ఒక గ్రూప్‌ను తయారు చేసుకొని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. పరకాల నియోజకవర్గం మీద తమ పట్టు నిలుపుకోవాలని కొండా దంపతులు భావిస్తున్నారు.
ఇందిరమ్మ కమిటీలతో తన వర్గానికే మేజర్ వాటా పదవులు వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. మంత్రి హోదాలో పరకాల నియోజకవర్గంలో తరుచుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన నియోజకవర్గంలో వారి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రేవూరికి, కొండాకు మధ్య ఫోన్లో తీవ్రస్థాయి వాగ్వాదమే జరిగింది. చివరకు ఫ్లెక్సీల గొడవలతో రెండు వర్గాలు రోడ్ల మీది కొట్టుకునే వరకు వచ్చింది.
మొదటినుంచీ మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. సీతక్క పనులు సజావుగా సాగకుండా అక్కడ కూడా కొండా దంపతులు వర్గపోరు రాజేసినట్టు తెలుస్తున్నది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకు తీవ్రస్థాయి విభేదాలే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కొండా దంపతులకు అసలు పడటం లేదు.
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నట్టుగా రాజకీయం సాగుతున్నది. దమ్ముం టే బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ మధ్య కాలంలో కొండా మురళి బహింరం గ సవాల్ విసిరారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని మురళి పదేపదే చెప్తుండటంతో అక్కడి ఎమ్మె ల్యే యశస్వినీరెడ్డి గుర్రుగా ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో వర్గపోరు రాజుకున్నది. ఇక్కడినుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి రవీందర్‌రెడ్డిది కా మారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం. బీజేపీలో ఉన్న ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరగా.. బాన్సువాడ టికెట్ ఇచ్చారు.
అప్పటివరకు ఈ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు బాలరాజు తీవ్ర మనస్థాపంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. తనకు వస్తుందనుకున్న టికెట్‌ను ఎగురేసుకుపోయిన ఏనుగు రవీందర్‌రెడ్డి మీద కోపం పెంచుకున్నారు. బాల్‌రాజ్‌కు టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ పదవి లభించింది. తాజాగా బాలరాజు, పోచారం ఒక వర్గంగా, ఏనుగు రవీందర్‌రెడ్డి వైరివర్గంగా వర్గపోరు నడుస్తున్నది.
హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పీజేఆర్ కూతురు విజయారెడ్డి వర్గాల మధ్య వైరం ఏర్పడింది.
ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం కుటుంబంపై పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగానే తిరుగుబాటు చేస్తున్నారు. జిల్లాలో గడ్డం కుటుంబం పెత్తనం తగ్గించాలని పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాస్తున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధంగా ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి పార్టీ టికెట్లు ఇవ్వడమే తొలి తప్పు అని ఆ జిల్లా ద్వితీయశ్రేణి నాయకులు అంటున్నారు. మళ్లీ అదే కుటుంబానికే మంత్రి పదవి ఇస్తామనేలా అధిష్ఠానం నుంచి లీకులు వదలడాన్ని జిల్లా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావు గడ్డం కుటుంబానికి వైరి వర్గంగా ఉన్నారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. తనను కాదని వేరొకరికి మంత్రి పదవి ఇస్తే తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవలే బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శీహరిరావు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయాయి.