MLA Danam Nagender | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ‘ఏయ్.. మూస్కోవోయ్.. నీయమ్మ.. బయట కూడా తిరగనియ్యం.. నా కొడనా మిమ్మల్ని.. ఏమనుకుంటున్నార్రా మీరు.. ఏయ్ తోలుతీస్తా కొడకా ఒక్కొక్కనిది.. తోలుతీస్తా ఒక్కొక్కనిది.. తొక్కుతా.. తోలుతీస్తా.. ఏమ్.. అరేయ్.. బయటకూడా తిరగనియ్యం చెప్తున్నా. రేయ్ రారా.. రా.. నీయమ్మ ఏం మాట్లాడుతున్నవ్?’ ఇవీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడిన బండ బూతులు. హైదరాబాద్ అభివృద్ధిపై జరుగుతున్న లఘు చర్చలో మాట్లాడేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం ఇచ్చారు. అయితే, అప్పటికే జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వాలని పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని స్పీకర్‌ను కోరారు. ‘ఆయన ఏ పార్టీయో సభలోనే చెప్పాలి’ అంటూ కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. దీంతో దానం నాగేందర్ నోటికి వచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఊగిపోయారు. చైర్ నుంచి స్పీకర్ వద్దని వారిస్తున్నా.. ఆగ్రహంతో ఊగిపోతూ నోరు అదుపు తప్పి మాట్లాడారు.
దానం నాగేందర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘నీకు దమ్ముంటే సభ బయటికి రా చూసుకుందాం’ అంటూ సవాల్ చేశారు. ‘ఏం రా.. ఏం..’ అంటూ దానం నాగేందర్ ముందుకు రావడంతో.. ప్రతిగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. సభలో రగడ మొదలవుతుండటం, దానం నాగందేర్ నోరు అదుపు తప్పుతుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అతనికి రక్షణగా వెళ్లారు. విప్ ఆది శ్రీనివాస్తోసహా 14 మంది ఎమ్మెల్యేలు ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా దానం నాగేంద్కు అండగా నిలిచారు. ప్రతిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలంతా రన్నింగ్ కామెంట్రీతో గట్టిగా నినాదాలు చేశారు. దానం నాగేందర్‌కు కుడిపక్కన ముగ్గురు, వెనుక ముగ్గురు, ఎడమ పక్కన 8 మంది ఎమ్మెల్యేలు వరసగా నిలుబడి అతనికి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యేలను కేటీఆర్ వారించి వెనక్కి తీసుకెళ్లారు. అటు నిరుద్యోగులపై, ఇటు దానం దురహంకార వ్యాఖ్యలపై మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో ‘షేమ్.. షేమ్..’ అంటూ నినాదాలు చేసుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య బాహాబాహీ జరుగుతున్నా.. సభలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవ్వరినీ వారించే ప్రయత్నం చేయలేదు. సభా నాయకుడే అలా చూస్తూ ఉండిపోయారు. సభలో గందరోగళం ఏర్పడటంతో హుటాహుటిన 15 మంది మార్షల్స్‌ను రంగంలోకి దించారు.
నిండు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని, అది తాను రిపీట్ చేయదలచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. ఎవరు రెచ్చగొట్టారు? ఎవరిది తప్పు? అనేది తాను ప్రస్తావించడం లేదని, ఆ తప్పు జరిగింది కాబట్టి.. ఒక సీనియర్ సభ్యుడిగా ఆయన క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ కోరారు. ‘నన్ను మీరు ఎన్నో ఏండ్లుగా చూస్తున్నారు. అనుకోకుండా అలా జరిగింది. సభలో నేను మాట్లాడే విధానమేందో అందరికీ తెలుసు. ఆ మాటలకు నేను చింతిస్తున్నా. హైదరాబాద్‌లో నీయమ్మ, మాయమ్మ అనేది కామన్’ అని దానం నాగేందర్ చెప్పారు. అయితే, దానం నాగేందర్ వాడిన పదాలను సభా రికార్డులను పరిశీలించి తొలగిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులపై అతిగా మాట్లాడితే సహించేది లేదని, నాలుక చీరేదస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ హెచ్చరించారు. ‘బార్ ముందు రాత్రి పూట బీడీలు అమ్ముకొన్న.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నువ్వు కూడా మాట్లాడవడితివి’ అంటూ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను దుశ్శాసన సభగా మార్చేసిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి దుర్యోధనుడి వలె వికటాట్టహాసం చేస్తూ సైగలు చేస్తుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దుశ్శాసనుడిలా చెలరేగిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యసమాజం సహించరాని భాషను శాసనసభలో దానం నాగేందర్ ఉపయోగిస్తుంటే స్పీకర్ మైక్ కట్ చేయకపోగా యథేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాహంకారం, ఫ్యూడల్ అహంకారం కలిస్తే కాంగ్రెస్ పాలన అని ధ్వజమెత్తారు.