హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) నానాటికీ అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మరో ముగ్గురు వారికి తోడవడంతో ఆ సంఖ్య 13కు చేరింది. మంత్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే సమావేశం నిర్వహించినంట్లు ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా, ఆపరేషన్ రోప్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి తన అసంతృప్తిని అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
పేదల ఇండ్లు కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైడ్రా, అధికారుల విషయంలో కూడా వెనక్కి తగ్గేదిలేదన్నారు. తాను కాంప్రమైజ్ కాలేదు.. కాబోనని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని వెల్లడించారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నాయని తెలిపారు. తన ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి. వారి ఫొటోలు ఉంటే తప్పేంటి. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వాళ్లది అంటూ చెప్పుకొచ్చారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన విషయాన్ని ప్రస్తావిచంగా.. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదు.. వచ్చాక స్పందిస్తానన్నారు.
కాగా, పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలుపొందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటోను తీసివేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు.. కార్యాలయంపై దాడిచేసి కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించి. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాయకుల ఫొటోలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.