హైదరాబాద్: ప్రపంచ హోమియోపతి దినోత్సవం (World Homeopathy Day) సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Raja Narasimha) శుభాకాంక్షలు తెలిపారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానమన్నారు.
ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2025 థీమ్ ‘ఆరోగ్యకర భవిష్యత్తు కోసం: సహజ, సురక్షితం, సమర్థవంతమైనది’ అనే నినాదంతో హోమియోపతి వైద్యం ప్రాముఖ్యత, సూత్రాలు, ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెట్ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హోమియోపతి వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి, వినియోగదారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రపంచ హోమియోపతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.