హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : గాంధీ దవాఖానలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం దవాఖాన పనితీరుపై సమీక్షించారు. హాస్పిటల్లో ఐవీఎఫ్, ఐయూఐ సేవల బలోపేతం, విసర్తణకు చర్యలు చేపట్టాలని, సీటీ, ఎంఆర్ఐ స్కాన్లతోపాటు ఇతర హెల్త్ ఎక్విప్మెంట్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. ఎక్విప్మెంట్ మరమ్మతుల కోసం టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అన్ని ఆపరేషన్ థియేటర్లు ఒకేచోట ఉండేలా ఓటీ కాంప్లెక్స్ ఏర్పాటుపై కమిటీని నియమించి నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. పేషంట్ల సహాయకుల కోసం ప్రస్తుతం ఉన్న షెడ్డు స్థానంలో సీఎస్ఆర్ నిధులతో కొత్తగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దవాఖానలో ఓపీ, ఐపీ, సర్జరీలు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత పెంచనున్నట్టు మంత్రి దామోదర వెల్లడించారు.
రోడ్లకు నిధుల విషయంలో వెనకాడొద్దు