సంగారెడ్డి, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మం గళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మహిళల నుంచి నిరసన ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేసిన తరువాత చీరలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ‘మాకు చీరలు అవసరం లేదు. ముందు రెండు ఇస్తామని.. ఇప్పుడు ఒకటే చీర ఇస్తున్నారు’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ‘మాకు చీరలు వద్దు.. మీ ప్రభుత్వం ఇస్తామన్న నెలకు రూ.2,500 కావాలి’ అని మరికొందరు డిమాండ్ చేశారు. మంత్రి మా ట్లాడుతున్న సమయంలోనూ కొందరు అడ్డుతగిలారు. తమకు గ్యాస్ పైసలు ఇస్తలేరని, పింఛన్లు వస్తలేవని కింద నుంచి అడుగుతున్న మహిళలను మంత్రి సముదాయించే ప్రయత్నం చేశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నిరసన సెగ తగిలింది. బిచ్కుంద పట్టణ పరిధిలోని కందర్పల్లిలో మంగళవారం ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా లేచిన మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరిని అడిగి తమ గ్రామాన్ని బిచ్కుంద మున్సిపాలిటీలో విలీనం చేశారని నిలదీశారు. ఆరు గ్యారంటీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేయడంతో అంతా ఒక్కసారిగా లేచారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తమపైనే మండిపడతారా? అని ప్రశ్నించారు. ‘మీ చీరలు మాకేం వొద్దు’ అంటూ వెళ్లిపోయారు. – బిచ్కుంద
పెద్దపల్లి, జనవరి 20(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన వేళ తాయిలాల వల వేసింది. రేపో మాపో ఎన్నికల కోడ్ కూసే సమయంలో పట్టణ ప్రాంతాల మ హిళా సంఘాలకు హడావిడిగా మంగళవారం నుంచి ‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ’కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో మహిళా సంఘాలకు ఆర్డీవో కాసబోయిన సురేశ్, ఇతర అధికారులు చీరలను పంపిణీ చేశారు. కాగా, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.