హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ని త్వరలో డైరెక్టర్ సెకండరీ హెల్త్‌గా అప్ గ్రేడ్ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ప్రతినిధులు మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. మంత్రిని కలిసిన వారిలో టీజీజీడీఏ అధ్యక్షుడు నరహరి, సెక్రటరీ జనరల్ లాలూప్రసాద్, రావుఫ్, వినయ్ కుమార్, గోపాల్, క్రాంతి, అశోక్, రామ్‌సింగ్ ఉన్నారు.
ఘోష్ కమిషన్ నివేదిక చట్టవిరుద్ధం ; మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై విచారణ చేపట్టేందుకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లోపభూయిష్టంగా వ్యవహరించిందని, చట్టవిరుద్ధంగా నివేదికను రూపొందించిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణలో భాగంగా అనుసరించాల్సిన కీలకమైన ప్రక్రియనే కమిషన్ విస్మరించిందని, దీంతో ఆ కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమపై ఆరోపణలు చేస్తున్న వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.