హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ క్యాన్సర్ స్రీనింగ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాకో క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుచేయాలని నిర్ణయించామని స్పష్టంచేశారు.
నిరుపేద పేషంట్లకు సేవలు అందిస్తున్న బసవతారకం లాంటి దవాఖానలకు ప్రభుత్వం సహకరించనున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో బసవతారకం దవాఖాన ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత అని కొనియాడారు.
తనకు దామోదర రాజనరసింహ పేరుతో సినిమా చేయాలని ఉందని బాలకృష్ణ తెలిపారు. గతంలో తన తొలి ఫ్యాక్షన్ సినిమా పేరు ‘సమర సింహారెడ్డి’ అని గుర్తు చేసిన బాలకృష్ణ.. డీ రాజసింహ అని సినిమా పేరు పెట్టాలని ఉందని, డీ అంటే దామోదర కాదని ‘దబిడి దిబిడి రాజసింహ’ అని బాలకృష్ణ నవ్వుతూ చెప్పారు.